అమర్ కోసం దిగొచ్చిన తారలు
సమాజ్ వాది పార్టీ నాయకుడు అమర్ సింగ్ కు ఈనెల 10న సింగపూర్ లో జరిగిన కిడ్నీమార్పిడి చికిత్స విజయవంతమైంది. అమర్ సింగ్ సర్జరీ చేసే సమయంలో పలువురు తారలు ఆయన వెన్నెంటే ఉండగా, మరికొందరు తమ అత్యవసర షూటింగ్ లు కూడా రద్దు చేసుకుని ఆసుపత్రికి తరలి వెళ్లారు. అమర్ సింగ్ సన్నిహిత మిత్రుడైన అమితాబ్ బచ్చన్ తీవ్రమైన కడుపునొప్పి కారణంగా చివరి నిమిషంలో తన సింగపూర్ పర్యటన రద్దు చేసుకుంటే, మరో సన్నిహితుడు సంజయ్ దత్ కు వీసా నిరాకరించడంతో ఆయన వెళ్లలేకపోయారు. అయితే అమర్ సింగ్ సర్జరీ సమయంలో జయాబచ్చన్ ఆయన వెంటే ఉండగా, సంజయ్ దత్ భార్య మాన్యత కూడా జయాబచ్చన్ తో కలిశారు. తమ కుటుంబానికి సన్నిహిత మిత్రుడైన అమర్ సింగ్ యోగక్షేమాలు విచారించడం తన బాధ్యతగా భావించిన ఐశ్వర్యారాయ్ 'రోబో' షూటింగ్ షెడ్యూల్ ను కేన్సిల్ చేసుకుని అక్కడికి వెళ్లారు. జయప్రద సైతం తనకు రాజకీయ గురువైన అమర్ సింగ్ కు ఈ క్లిష్ట సమయంలో వెన్నుదన్నుగా నిలిచింది.
అమర్ ను కలిసేందుకు జయప్రదతో సహా అంతా ఒకే చోట చేరుకోవడంతో అక్కడి వాతావరణం 'గర్ల్స్ క్లబ్'ను తలపించిందనీ, సర్జరీ ఎలా జరిగింది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునేందుకు ఆయన తరఫున అంతా ఇక్కడకు వచ్చినట్టు ఓ ప్రముఖ స్టార్ భార్య తెలిపారు. 'ఎవరూ షాపింగ్ కు గానీ, సైట్ సీయింగ్ కు కానీ వెళ్లలేదు. ఇంతమంది స్టార్స్ భార్యలు ఇక్కడకు రావడంతో మా మధ్య మరింత అనుబందం బలపడినట్టయింది' అని ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు. జయప్రద ఆసుపత్రిలో కొద్ది సమయాన్నే వెచ్చించగా, జయాబచ్చన్, మాన్యత, ఐశ్వర్యారాయ్ మాత్రం అమర్ సింగ్ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని వైద్యులు చెప్పేంతవరకూ ఆయన వెంటే ఉన్నారు. నిజానికి అమితాబ్ తో కలిసి జయాబచ్చన్ సింగపూర్ బయలుదేరాలనుకున్న తరుణంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందిలో పడింది. దాంతో ఆమె ధైర్యం చిక్కబుచ్చుకుని ఒంటరిగానే సింగపూర్ వెళ్లాల్సి వచ్చింది. 'అమిత్ జీ ఆరోగ్యం ఆందోళన పడాల్సిన పని లేదు. కడుపునొప్పి తప్పితే అమిత్ జీకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఆయన స్వస్థతతో ఉన్నారు' అని జయాబచ్చన్ తెలిపారు. అమర్ సింగ్ కూడా త్వరగా కోలుకుంటున్నారనీ, త్వరలోనే ఆయనతోనే బయలుదేరుతామనీ చెప్పారు. మాన్యత మాత్రం మంగళవారంనాడు ముంబై చేరుకున్నారు.
News Posted: 15 July, 2009
|