వర్మ 'అజ్ఞాత్'కు లీగల్ చిక్కు!
రామ్ గోపాల్ వర్మ తీసిన కొన్ని సినిమాలు రిలీజ్ తర్వాత సంచలనాలు సృష్టిస్తే ఇటీవల కాలంలో థియేటర్లకు రాకముందే ఆయన సినిమాలు ఏదో రకమైన చిక్కుల్లో పడి మరో రకమైన సంచలనాలకు దారితీస్తున్నాయి. వర్మ విడుదలకు సిద్ధం చేసిన 'రణ్' చిత్రంలోని 'జనగణ మణ రణ్ హై' పాట సెన్సార్ వేటు పడి ఆ తర్వాత ఆ వివాదం సుప్రీంకోర్టుకు, అట్నించి అటు అప్పిలేట్ ట్రిబ్యునల్ కు వెళ్లింది. జాతీయగీతమైన 'జన గణ మణ..'ను వర్మ ఈ చిత్రం కోసం రీమిక్స్ చేయడమే వివాదానికి ప్రధాన కారణమైంది. తాజాగా వర్మ మరో చిత్రం 'అజ్ఞాత్' కూడా లీగల్ సమస్యను ఎదుర్కొంటోంది.ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగులో 'అడవి' పేరుతో ఆగస్టు 7న విడుదలకు వర్మ సన్నాహాలు చేస్తున్నారు. అయితే లీగల్ చిక్కు వీడాల్సి ఉన్నట్టు సమాచారం. నితిన్, ప్రియాంక కొఠారి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని యూటివీ మోషన్ పిక్చర్స్ సమర్పణలో ఎ డ్రీమ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ఆర్.స్క్రూవాలా, రామ్ గోపాల్ వర్మ సంయుక్తంగా నిర్మించారు.
హారర్ థ్రిల్లర్ గా వర్మ తెరకెక్కించిన 'అజ్ఞాత్' చిత్రానికి తన స్క్రిప్టునే వాడుకున్నారంటూ రచయిత సాజిద్ వారియర్ ఇటీవల సినీ రచయిత సంఘం (ఎఫ్ డబ్ల్యుఎ)కు ఫిర్యాదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఎఫ్.డబ్ల్యు.ఎ. ఆయనకు 8 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా వర్మను గత ఏప్రిల్ లో ఆదేశించింది. ఈ వ్యవహారం రైటర్స్ అసోసియేషన్ పరిధిలోకి రాదంటూ వర్మ ముంబై హైకోర్టులో సవాలు చేశారు. వారియర్ మాత్రం తన ఫిర్యాదులో గత ఏడాది తాను వర్మను కలిసి స్టోరీ డిస్కెషన్ చేశాననీ, స్క్రిప్టు కాపీని కూడా ఆయనకు ఇచ్చాననీ పేర్కొన్నారు. అయితే ఇద్దరి మధ్యా అవహాగన కుదరలేదనీ, ఆ తర్వాత క్రమంలో తన కథ ఆధారంగానే వర్మ 'అజ్ఞాత్' సినిమా తీసినట్టు తనకు తెలిసిందని అన్నారు. దీనిపై గత ఏడాది వర్మకు వారియర్ నోటీసు పంపి, ఆ తర్వాత ఎఫ్.డబ్ల్యు.ఎ.ను ఆశ్రయించారు. ఈ తరహా వివాదాలు కోర్టు బయటే పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నందున వర్మ తదుపరి చర్య ఏమిటనేది చూడాల్సి ఉంటుంది.
News Posted: 16 July, 2009
|