హాలీవుడ్ నటులు తరచు ఆమెరికా అధ్యక్షులను స్ఫూర్తిగా తీసుకుని ఆ తరహా పాత్ర పోషణకు తహతహలాడుతుంటారు. రోనాల్డ్ రీగన్ ఇందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా. ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఇలాంటి అరుదైన సంఘటన చోటుచేసుకోనుంది. భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు సైతం చాటిన మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలామ్ ఇప్పుడు 'మై కలామ్ హూ' అనే చిత్రం ద్వారా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.
రాష్ట్రపతి పదవిని స్వీకరించడానికి ముందు ఏరోనాటికల్ ఇంజనీర్ గా, సైంటిస్ట్ గా దేశానికి విశిష్ట సేవలు అందించిన ఖ్యాతి కలామ్ కు దక్కుతుంది. ఖండాతర క్షిపణలు, వ్యోమగాములకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ను ఆయన చేపట్టారు. 'మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా'గా ఖ్యాతి పొందారు. నేటి బాలులే రేపటి ప్రగతి సారథులని బలంగా విశ్వసించే కలామ్ కు చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం. దానిని దృష్టిలో ఉంచుకునే 'మై కలామ్ హూ' చిత్రంలో నటించేందుకు కలామ్ తన సమ్మతి తెలియజేశారు. ఇందులో కలామ్ పలువురు చిన్నారులతో కలిసి నటించబోతున్నారు. మాధవ్ పాండియ దర్శకత్వంలో స్లైమ్ ఫౌండేషన్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. 'కలలు కనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అయితే ఆ కలలు ఉన్నంతగా ఉండాలి' అని తరచు కలాం ఉద్బోధిస్తుంటారు. ఈ పాయింట్ ఆధారంగానే 'మై కలామ్ హూ' ఉండబోతోంది. ఈ చిత్రంలో బాలావుడ్ ప్రముఖుడు గుల్షన్ గ్రోవర్ ఫ్రెంచ్ నటి సోఫియాతో కలిసి నటించబోతున్నారు. కలామ్ తన నిజజీవిత పాత్రనే...అంటే కలామ్ పాత్రనే పోషించబోతున్నారు. కలాం నుంచి స్ఫూర్తి పొంది తన బిగ్ డ్రీమ్ ను సఫలం చేసుకోవాలనుకునే రాజస్థాన్ కు చెందిన ఓ బాలుడి ఇతివృత్తం చుట్టూ ఈ చిత్రం ఉంటుంది. 'స్లమ్ డామ్ మిలయనీర్' తరహాలోనే రాజస్థాన్ లోని స్లమ్స్ నుంచి ఓ బాలనటుడి ఎంపిక జరుగనుందనీ, ఆ క్యారెక్టర్ కోసం అతనికి శిక్షణ కూడా ఇవ్వబోతున్నారనీ గుల్షన్ తెలిపారు. ఫ్రెంచ్ నటి సోఫియా టూరిస్ట్ గా ఇందులో నటించనుంది. ఇండియాకు వచ్చిన సోఫియా గుల్షన్ తో ప్రేమలో పడుతుంది. ఈ చిత్రాన్ని తొలుత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించి ఆ తర్వాత పలు అంతర్జాతీయ ఫెస్టివల్స్ కు కూడా పంపాలని ఫిల్మ్ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.