సింగర్ నగలు లాక్కొన్నారు!
డుర్బాన్ : ప్లే బ్లాక్ సింగర్ సునిధి చౌహాన్ నుంచి కాస్టూమ్స్ జ్యూయెలరీని కోర్టు షరీష్ స్వాధీనం చేసుకున్నారు. డుర్బాన్ కు చెందిన సునీల్ సింగ్ అనే పారిశ్రామిక వేత్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఉత్వర్వులు జారీ చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఓ ఈవెంట్ షో కోసం సునిధితో అగ్రిమెంట్ చేసుకుని పూర్తి డబ్బు కూడా చెల్లించాననీ, అయితే సునిధి తన మాట నిలబెట్టుకోలేదనీ సునీల్ సింగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రావాల్సిన 5,500 డాలర్ల సొమ్మును (2.58 లక్షలు) ఆమె నుంచి ఇప్పించాల్సిందిగా సింగ్ చేసిన విజ్ఞప్తి మేరకు సునిధి నగలను జప్తు చేయాల్సిందిగా డుర్బాన్ హైకోర్టు ఆదేశించింది.
సునిధి రెండ్రోజుల క్రితం ఓ స్టేజ్ షో కోసం సన్నద్ధమవుతున్న తరుణంలో ఆభరణాల స్వాధీనం కోసం కోర్టు షరీప్ నేరుగా గ్రీన్ రూమ్ లో కి వెళ్లారు. అయితే సునిధి వద్ద తగినన్ని ఆభరణాలు లేకపోవడంతో కాస్టూమ్స్ జ్యూయెలరీని జప్తు చేశారు. వాటి విలువ ఇంకా తెలియవలసి ఉంది. 2008లో హిట్టయిన 'దోస్తానా' చిత్రం చార్డ్ బస్టర్ కావడంతో ఒక్కసారిగా సునిధి పేరు పాపులర్ అయింది. కోర్టు షరీఫ్ చర్య అనంతరం కూడా శనివారంతో ముగిసిన ఈవెంట్ టూర్ లో సునిధి పాల్గొన్నారు. 2001లో సునిధితో ఒక కన్సెర్ట్ కోసం డబ్బు చెల్లించాననీ, నవంబర్ లో ఆ షో జరగవలసి ఉండగా అదే ఏడాది సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో సునిధి ఆ కన్సెర్ట్ ను వాయిదా వేసిందనీ సింగ్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె టూర్ కోసం తానెన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆమె నిరాకరిస్తూ వచ్చిందన్నారు. అయితే మరో ప్రమోటర్ కోసం 2002లో సౌతాఫ్రికాలో ఆమె ప్రదర్శన ఇచ్చిందనీ, 2003-2004లో తాను మళ్లీ చేసిన విజ్ఞప్తులను కూడా ఆమె తోసిపుచ్చిందనీ చెప్పారు. ప్రస్తుతం ఆమె పలు కన్సెర్ట్ లో పాల్గొంటున్న విషయం తెలుసుకుని గత వారంలో ఆమె లాయర్స్ తో సంప్రదించాననీ, అయితే వారు తనకు ఎలాంటి భరోసా ఇవ్వలేదనీ పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వులతో అధికారులు దర్బాన్ లోని ఐసిసి సెంటర్ లో ఉన్న సునిధి రూమ్ కు వచ్చిన విషయం నిజమేననీ, వారికి సునిధి సహకరించారనీ ఆమె తరఫు దక్షిణాఫ్రికన్ అటార్నీ వివరణ ఇచ్చారు.
News Posted: 20 July, 2009
|