హృతిక్ చేతిపై సుసానే టట్టూ
హృతిక్, సుసానే వైవాహిక బంధం చిక్కుల్లో పడిందంటూ పలు వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉండటంతో 'అలాంటిదేమీ లేదు' అని గట్టిగా నమ్మకం కలిగించేందుకు హృతిక్ కృతనిశ్చయంతో ఉన్నట్టు కనిపిస్తోంది. 'కైట్స్' చిత్రంలో నటిస్తున్న బార్బరా మోరీ తన కో-స్టార్ మాత్రమేననీ, సుసానేతో తన అనుబంధం చెక్కుచెదరలేదనీ చెప్పేందుకు హృతిక్ సిన్సియర్ గానే ప్రయతిస్తున్నారు. తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ తాజాగా తన కుడిచేతి మణికట్టుపై సుసానే పచ్చబొట్టు పొడిపించుకున్నారు. అంతేకాదు...టట్టూ చాలా బాగా రావడంతో సంతోషం పట్టలేకుండా ఉన్నారు.
'హృతిక్ చాలాకాలంగా సుసానే పచ్చబొట్టు వేయించుకోవాలని ప్లానే చేస్తున్నారు. ఎట్టేకేలకు ఆయన టట్టూ ఆర్టిస్ట్ సమీర్ పంతంగే కు ఆ బాధ్యత అప్పగించారు. గతంలో కూడా హృతిక్, సుసానాకే సమీర్ టట్టూలు వేశారు. సునానే పిల్లలతో కలిసి లండన్ లో ఉన్న సమయం చూసి హృతిక్ ఆమె పేరును పచ్చబొట్టుగా వేయించుకున్నారు. ఇప్పుడు ఆయన కూడా లండన్ వెళ్లి సుసానేను ఆశ్చర్యంలో ముంచెత్తనున్నారు' అని హృతిక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. హృతిక్ మణికట్టుపై టట్టూ వేసిన విషయాన్ని సమీర్ పతంగే ధ్రువీకరించారు. కొద్దినెలల క్రితమే ఒక మంచి డిజైన్ రెడీ చేయాల్సిందిగా హృతిక్ తనను కోరారనీ, టట్టూ ఎలా ఉండాలనే విషయంలో ఆయన నివాసంలో తాము పలుసార్లు కలుసుకున్నామనీ చెప్పారు. తాను ఎంపిక చేసిన ఎల్విస్ అనే ఓ అద్భుతమైన ఫాంట్ హృతిక్ కు కూడా బాగా నచ్చిందన్నారు. పచ్చబొట్టు వేస్తున్నప్పడు హృతిక్ అందించిన సహకారం మాత్రం తాను మరచిపోలేనని చెప్పారు. 'టట్టూ వేయడానికి ముందు...వేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వాటిని హృతిక్ ఎంతో ఓపికగా పాటించారు. ఆ తర్వాత టట్టూ చూసి ఎంతో థ్రిల్ అయ్యారు. సూసానాకు చూపించేంత వరకూ ఆత్రం ఆపుకోలేనంత చిన్న పిల్లాడి మనస్థత్వం ఆయనది' అంటూ సమీర్ నవ్వుతూ చెప్పారు.
News Posted: 21 July, 2009
|