సంజయ్ బర్త్ డేకి ప్రియాదత్
సంజయ్ దత్ తన తదుపరి చిత్రమైన 'నో ప్లాబ్లం' షూటింగ్ కోసం ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నారు. దీంతో అక్కడే ఈనెల 29న ఆయన 50వ బర్త్ డే జరపాలని సంజయ్-మాన్యత దంపతులు నిశ్చయించారు. అయితే ఈ బర్త్ డే సింపుల్ గానే ఉండబోతోంది. సంజయ్ మిత్రుడు, సమాజ్ వాది పార్టీ నాయకుడు అమర్ సింగ్ ఇటీవలే సర్జరీ అనంతరం కోలుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి ఆర్భాటాలకు తావులేకుండా ఈ బర్త్ డే నిర్వహించదలచారు. ఆసక్తి కలిగించే మరో ముచ్చట కూడా ఉంది. మాన్యతను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సంజయ్ తో ఎడమొగం పెడమొగంగా ఉంటున్న ప్రియాదత్ ను (సంజయ్ సోదరి, పార్లమెంటు సభ్యురాలు) ఈ బర్త్ డే వేడుకకు ఆహ్వానించారు.
అంతా సజావుగా జరిగితే తన సోదరుడి బర్త్ డే వేడుకలో పాల్గొనేందుకు ప్రియాదత్ దక్షిణాఫ్రికా వచ్చే అవకాశాలున్నాయని సంజయ్ దత్ ప్రొడక్షన్స్ సిఇవో ధరమ్ ఒబెరాయ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన కూడా దక్షిణాఫ్రికాలోనే ఉన్నారు. ముంబైకి చెందిన సన్నిహిత మిత్రుల మధ్య నిరాడబంరంగా ఈ వేడక జరుగుతుందని ఆయన వెల్లడించారు. సంజయ్ దత్ తన ఫ్యామిలీ సభ్యుడనీ, అతను ఎక్కడ ఉన్నా సరే బర్త్ డే వేడుకలో తాను పాల్గొంటాననీ సంజయ్ దత్ ఆప్తమిత్రుడు బంటీ వాలియా తెలిపారు. మరి ప్రియాదత్ మాటో? ఆమెను బర్త్ డే పార్టీకి ఆహ్వానించి ఉండొచ్చు. అయితే పార్లమెంటు సభ్యురాలిగా బాధ్యతల నిర్వహణకే ఆమె మొగ్గుచూపుతున్నారు. 'పార్లమెంట్ సమావేశాల దృష్ట్యా ఢిల్లీలో ఉండాల్సి ఉంది. పార్టీకి వెళ్లకపోవచ్చు' అని ప్రియాదత్ తెలియజేశారు.
News Posted: 23 July, 2009
|