వీల్ చైర్ లో హృతిక్
హృతిక్ కు ఉన్న అభిమానుల్లో చిన్నపిల్లలే ఎక్కువ. సినిమాల్లో ఆయన చేసే 'సూపర్' ఫీట్సే అందుకు కారణం. ప్రస్తుతం ఆయన సొంత బ్యానర్ లో నటిస్తున్న 'కైట్స్' కూడా ఇందుకు భిన్నం కాదు. ఎన్నో సూపర్ ఫీట్స్ ఇందులో ఉండబోతున్నాయి. హృతిక్ తదుపరి ఫీట్ ఏమై ఉంటుంది? ఈసారి ఆయన 'వీల్ చైర్'ను అంటిపెట్టుకునే పాత్ర చేయబోతున్నారు. వెన్నెముక దెబ్బతిని అవయవాలు చచ్చుబడిపోయిన (పారాప్లెజిక్) వ్యక్తి పాత్రను సంజయ్ లీలా బన్సాలీ 'గుజారిష్'లో చేయబోతున్నారు. 'ఇంట్లోనే వీల్ చైర్ తో తిరుగుతూ హృతిక్ కనిపించబోతున్నారనుకుంటే పొరపాటే. చాలా పవర్ ఫుల్ గా ఆయన పాత్ర ఉండబోతోంది' అంటున్నారు బన్సాలీ. తొలి షెడ్యూల్ లో భాగంగా ఆయన గోవాను ముంబైకి రప్పిస్తున్నారు. అదెలా సాధ్యమంటారా? ముంబైలోని ఓ స్టూడియోలో గోవా సెట్ వేయిస్తున్నారు.
హృతిక్ పారాప్లెజిక్ పాత్రలో నటించనున్న విషయాన్ని బన్సాలీ ధ్రువీకరించారు. హృతిక్ తో పాటు ఇందులో ఐశ్వర్య పాత్రకు కూడా చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నామనీ, ప్రస్తుతం ఆ ఇద్దరూ వేరే సినిమాలతో బిజీగా ఉన్నందున అవి పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ పై పూర్తి దృష్టి సారిస్తారనీ ఆయన తెలిపారు. బన్సాలీ కొద్ది వారాలుగా దేశంలోని పలువురు పారలాజిక్ పీపుల్ ను కలుస్తూ, ముంబై వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా కూడా ఆహ్వానిస్తున్నారు. 'ఆ అనుభూతిని మాటల్లో చెప్పాలేను. వారిని కలుసుకోవడం చాలా ఇన్ స్పైరింగ్ గా ఉంది. పలవురు వీల్ చైర్లకే పరిమితం. మరికొందరు జీవితాంతం మంచం దిగలేరు. అయితే వారిలో ఎంతో అత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. జీవితం పట్ల వారికున్న అవగాహన నన్ను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తింది' అని బన్సాలీ వివరించారు. శారీరక వైకల్యాన్నితక్కువ చేసి చూపించే విధంగా కాకుండా ఎంతో స్ఫూర్తిదాయకంగా 'గుజారిష్' సినిమా ఉండబోతోందనీ, తాను ఎలాంటి స్ఫూర్తి పొందానో అలాగే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రధారులు కూడా చక్కటి స్ఫూర్తితో నటించాలని కోరుకుంటున్నాననీ, అందుకు హృతిక్, ఐశ్వర్య ఏమాత్రం తీసిపోరని తాను నిశ్చితాభిప్రాయంతో ఉన్నాననీ చెప్పారు.
News Posted: 23 July, 2009
|