అనుష్కతో షాహిద్ డేటింగ్
షాహిద్ కపూర్ యవ్వారం చూస్తుంటే ఈ ఏడాది ప్లేబాయ్ అవార్డుకు ఆయన గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే అనిపిస్తుంది. సహజంగా ప్రేయసి ప్రియులు విడిపోతే మనసుకు తగిలిన గాయాలను మరచిపోవడానికి కొద్ది సమయం తీసుకుంటారు. షాహిద్ తమ మాజీ ప్రియురాలు ప్రియాంక చోప్రా దూరమైనందుకు కన్నీళ్లు పెట్టేందుకు సిద్ధంగా లేరు. ఎందుకంటే...అనుష్క శర్మ ('రబ్ నే బనా ది జోడి' ఫేమ్) నుంచి ఆయనకు తగిన స్వాంతన లభిస్తోందట.
ప్రేమ భగ్నమైనందుకు విచారించడం, ఆధ్యాత్మిక ఉపశమనానికి ప్రయత్నించడం షాహిద్ దృష్టిలో టైమ్ వేస్ట్ వ్యవహారంగానే చెప్పాలి. షాహిద్ పేరు చెప్పగానే ఆయన చుట్టూ తిరిగిన (తిప్పుకొన్న) అమ్మాయిల జాబితా చాలానే కనిపిస్తుంది. అలాంటి రిలేషన్స్ ఏమీ తాను పెద్దగా గుర్తుపెట్టుకోనంటూ ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో ఆయన గొప్పగా చెప్పడం బహుశా ప్రియాంక దృష్టికి కూడా వచ్చి ఉండొచ్చు. ఆ మాటెలా ఉన్నా...ఇప్పుడు షాహిద్ కొత్తమ్మాయిల జాబితాలో అనుష్క శర్మ వచ్చి చేరినట్టు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం మొదలైంది. పర్మీత్ సేథి దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న తాజా చిత్రంలో కలిసి నటిస్తున్న ఈ ఇద్దరూ బాగా దగ్గరైనట్టు చెబుతున్నారు. పదిరోజుల క్రితమే ఈ చిత్రం సెట్స్ పైకి వచ్చింది. షాహిద్ మాత్రం అనుష్క తనకెంతో కావాల్సిన వ్యక్తిగా ఎంతో చనువు ప్రదర్శిస్తున్నారనీ, దీనికి ముందే చాలాకాలం నుంచి ఆమెకు ఎస్ఎంఎస్ లు కూడా పంపుతున్నారనీ ఆ వర్గాల కథనం. షాహిద్ ను చూస్తే ఈమధ్యనే ప్రియాంకకు దూరమైన వ్యక్తిగా ఏమాత్రం అనుకోలేమని వారంటున్నారు. యష్ రాజ్ స్టూడియోలో గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుగుతున్నందున తమ 'డేటింగ్' వ్యవహారం ఎవరికీ తెలియదని షాహిద్-అనుష్క జంట అనుకుని ఉండొచ్చనీ, అయితే ఆ విషయం ఎలాగో బయటకు లీక్ అయిందనీ వారు చెప్పారు. గత రెండు రోజులుగా షాహిద్ తాజా డేటింగ్ వ్యవహారం గాలి కంటే వేగంగా జనాల్లోకి వెళ్లి చర్చనీయాంశమవుతోంది.
News Posted: 24 July, 2009
|