కార్గిల్ బాటపట్టిన అభిషేక్
'కార్గిల్ విజయ్ దివస్'కు సరిగ్గా పదేళ్లు. కార్గిల్, డ్రాస్ ప్రాంతాల్లో 40 రోజులకు పైగా పోరాడి పాకిస్థానీ చొరబాటుదారలను ఓడించి ఆ ప్రాంతాలను ఇండియన్ జవాన్లు తిరిగి స్వాధీనం చేసుకున్న కార్గిల్ ఘట్టం ఇప్పటికీ దేశప్రజల కళ్లముందే నిలుస్తుంది. ఈ యుద్ధంలో పలువురు భారత జవానులు వీరమరణం పొందారు. ఈనెల 26న విజయ్ దివస్ ను పురస్కరించుకుని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కార్గిల్ ప్రయాణం కట్టారు. ఆయన చేపట్టిన ఈ జర్నీ మొత్తాన్ని ఎన్టీటీవీ ప్రసారం చేయనుంది.
అభిషేక్ ఈ జర్నీలో భాగంగా కార్గిల్ సిపాయిల కోసం తన భార్య ఐశ్వర్యారాయ్, తల్లి జయాబచ్చన్ ఎంతో ప్రేమతో తయారు చేసిన 'క్యారెట్ హల్వా', 'మామిడి పండ్ల రసం' వెంట తీసుకు వెళ్లారు. తాత హరీష్ రాయ్ బచ్చన్ రాసిన 'అగ్నిపథ్' కవితను, తండ్రి అభిషేక్ బచ్చన్ సందేశాన్ని వారికి వినిపించారు. దశాబ్దం క్రితం కార్గిల్ యుద్ధం జరిగిన పలు ప్రాంతాలను అభిషేక్ పర్యటించారు. కార్గిల్ నుంచి డ్రాస్ వరకు సుమారు 8 గంటల ప్రయాణం ఉంది. జవాన్లు తీసుకువెళ్లే మార్గంలో అభిషేక్ నడుచుకుంటూ వెళ్లి వివిధ పోస్ట్ ల వద్ద ఉండే జవాన్లుతో సమావేశమయ్యారు. కార్గిల్ స్ఫూర్తితో తీసిన 'ఎల్ ఓసి కార్గిల్' సినిమాకు సంబంధించి తన అనుభవాలను నెమరువేసుకోడంతో పాటు, సాండో టాప్ వద్ద ఉన్న బంకర్ ను సందర్శించి అక్కడి ట్రైనింగ్ సెంటర్ లో కొన్ని రౌండ్ల కాల్పులు కూడా జరిపి జవాన్లను ఉత్సాహ పరిచారు.. కార్గిల్ అమరవీరుల స్మృత్యర్థం అభిషేక్ చేపట్టిన ఈ జర్నీని ఎన్డీటీవీ 'జై జవాన్' శీర్షికన ప్రత్యేక షోగా వచ్చే ఈ శనివారం రాత్రి 12 గంటలకు, తిరిగి ఆదివారం ఉదయం 11.30, రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనుంది.
News Posted: 24 July, 2009
|