ఇండియాలో సినీ నిర్మాణం 30 శాతం వరకూ తగ్గిందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ మధ్యన పేర్కొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్య ప్రభావంతో చూస్తే ఇండియాలో ఆ ప్రభావం తక్కువేనని బిగ్ బి ఇటీవల సిఎన్ఎన్ 'టాక్ ఆసియా' ప్రోగ్రాంలో చెప్పుకొచ్చారు. తామంతా గతంలో మాదిరిగానే తగినన్ని సినిమాల్లో పనిచేస్తున్నామనీ, అయితే కొద్దిగా పారితోషికం తగ్గించుకోవడం కూడా జరుగుతోందనీ ఆయన వివరణ ఇచ్చారు. పలువురు స్టార్ ల తరహాలోనే ఇప్పుడు అక్షయ్ కుమార్ కూడా ఓ మెట్టు దిగొచ్చారు. 60 కోట్లతో రూపొందిన ఆయన తాజా చిత్రం 'కంబఖ్త్ ఇష్క్' 100 కోట్లకు పైగా షేర్ రాబట్టి కమర్షియల్ సక్సెస్ ను కైవసం చేసుకున్న తరుణంలో అక్షయ్ తన రెమ్యునరేషన్ ను 30 కోట్ల నుంచి 20 కోట్లకు తగ్గించుకోవడం విశేషం. అయితే అక్షయ్ నిర్ణయం వెనుక అసలు రీజన్ వేరే ఉందని ఫిల్మీ వర్గాల ఉవాచ.
అక్షయ్ 'కంబఖ్త్ ఇష్క్' చిత్రానికి వచ్చిన ప్రావిట్ లో మూడో వంతు తన పారితోషికంగా తీసుకున్నారు. ఆ ప్రకారం చూస్తే ఆయనకు 30 కోట్ల రూపాయలకు పైగా ముట్టినట్టే. 'అక్షయ్ తన పారితోషికం తగ్గించుకుని ఉండొచ్చు. ఇదే సమయంలో ఆయన సినిమాకు వచ్చే లాభాల్లో మూడో వంతు ఇవ్వాలంటూ ముందే మాట్లాడుకుంటారు. సినిమా అమ్మకం జరిగిన మొత్తం నుంచి పెట్టుబడి మినహాయిస్తే వచ్చేదే లాభం.అక్షయ్ తన సినిమాకి అగ్రిమెంట్ చేసుకునే ముందు అసలు బడ్జెట్ ఎంతనేది తెలుసుకుంటారు. దీనివల్ల బడ్జెట్ పరిధుల్లోనే నిర్మాణం జరుగుతుంది. సినిమా హిట్టయితే రెమ్యునరేషన్ కు ప్రాఫిట్ కూడా వచ్చి చేరుతుంది. ఇది అక్షయ్ తో సినిమా తీయాలనుకునే నిర్మాతలకు కూడా లాభసాటి వ్యవహారమే అవుతుంది' అని ఆ వర్గాలు లోగుట్టు బయటపెట్టాయి. అక్కీ మంచి ఇంటెలిజెంట్ కదూ..