మిస్కిన్ డైరెక్షన్ లో కమల్
నటుడిగా ఏభైయవ వసంతంలోకి అడుగుపెట్టిన పద్శశ్రీ కమల్ హాసన్ 'ఉన్నై పోల్ ఒరువన్' చిత్రం ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇది తెలుగులో 'ఈనాడు' పేరుతో విడుదలవుతోంది. హిందీ 'ది వెన్స్ డే'కి రీమేక్ గా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం విడుదలకు ముందే కమల్ తదుపరి చిత్రం ఏమై ఉంటుందనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. కమల్ తో సినిమా తీయాలనే కోరికను ఇటీవలే ఓ కార్యక్రమంలో మురుగదాస్ ('గజనీ' ఫేమ్) బయటపెట్టారు. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం మురుగదాస్ తో పాటు, దర్శకుడు దర్శకుడు మిస్కిన్ సైతం కమల్ తో తదుపరి చిత్రానికి పావులు కదుపుతూ...మురుగదాస్ కంటే ఆయన ముందు వరుసలో ఉన్నారు.
మురుగదాస్, మిస్క్ న్ ఇప్పటికే చెరో స్క్రిప్టు కమల్ ముందుంచారు. మిస్కిన్-కమల్ మధ్య జరిగిన చర్చలు ఫలప్రదమయ్యాయనీ, మిస్కిన్ తో కలిసి పని చేసేందుకు కమల్ సుముఖత వ్యక్తం చేశారనీ తెలుస్తోంది. కమల్ సైతం ఇటీవల మిస్కిన్ తీసి 'అజాంతే' సినిమా డీవీడీ చూసి ఎంతో ఇంప్రెస్ అయ్యారనీ, అది విషయం మిస్కిన్ కు చెప్పి అభినందించారనీ సమాచారం. సంతోషంగా ఉబ్బితబ్బిబ్బయిన మిస్కిన్ విడుదలకు సిద్ధంగా ఉన్న తన తదుపరి చిత్రం 'నందలాల' డీవీడీని కమల్ కు చూపించారట. కమల్ ను కలుసుకున్న విషయాన్ని మిస్కిన్ సైతం ధ్రవీకరించారు. 'కమల్ ను కలిసి పలు విషయాలను ముచ్చటించడం జరిగింది. ఇంకా ఒక అవగాహన కుదరాల్సి ఉంది' అని తెలిపారు. భవిష్యత్తులో కమల్ సార్ తో పనిచేసే అవకాశాలు ఉన్నాయనీ, అదే జరిగితే అంతకంటే ఆనందం మరొకటి ఉండదనీ వివరించారు. కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మరుదనాయగం' చిత్రాన్ని మిస్కిన్ కు అప్పగించే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతోంది.
News Posted: 28 July, 2009
|