రాఖీ కోసం ముంబై మకాం
వధువు ఓకే అంది. ముహూర్తం కుదిరింది. ఇంకెందుకు ఆలస్యం అన్నట్టుగా రాఖీ మానసచోరుడు, టోరంటో బిజినెస్ మన్ ఎలేష్ పరుజన్ వాలా ముంబైకే తన మకాం మార్చే పనిలో పడ్డాడు. ఎన్టీటీవీ ఇమేజిన్ ఛానల్ లో 'రాఖీ కా స్వయంవరం' ప్రోగ్రాం లక్షలాది మంది వీక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇదంతా ఓ గాంబ్లిగ్ వ్యవహారమంటూ కుళ్లుకుంటున్న వారికి రాఖీ గత వారం గట్టి సమాధానమే ఇచ్చింది. వివాహ వ్యవస్థ పట్ల తనకెంతో నమ్మకముందనీ, వరుడిని ఎంచుకునే ప్రక్రియ పురాణాల కాలంలోనే ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు తప్పవుతుందనీ నిలదీసింది. ఇలాంటి వాళ్లందరికీ ఆగస్టు 2న పెళ్లితోనే సమాధానం చెప్పబోతున్నానని స్పష్టం చేసింది. పెళ్లయినా కెరీర్ ను వదులుకునే ప్రసక్తిలేదనీ, భార్యాభర్తలిద్దరం ఎవరి వృత్తి వ్యవహారాల్లో వాళ్లు బిజీ అయిపోతామనీ చెప్పుకొచ్చింది. తనకు కాబోయే వరుడు ఎలేష్ పరుజన్ కావచ్చని తన మనోగతాన్ని చూచాయగా బయటపెట్టింది.
రాఖీ మనోగతం, కెరీర్ పట్ల ఆమెకున్న పట్టుదల గమనించిన ఎలేష్ ఆమెను కష్టపెట్టడం కంటే తానే ముంబైకి మకాం మారిస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారట. పెళ్లి ఎక్కడో టోరంటో లో పెట్టుకోవడం, రాఖీని శ్రమపెట్టడం ఇష్టంలేకనే ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఇప్పటికే తన వ్యాపార లావాదేవీలను చాలామటుకు ముంబైకి బదలీ చేసినట్టు ఎలేష్ చెబుతున్నారు. 'రాఖీ సావంత్ ను సినిమల్లోనూ, మ్యూజిక్ వీడియోల్లోనూ చూసే వాడిని. అయితె పెళ్లి చేసుకుంటానంటూ ప్రపోజ్ చేసి ఆమెకు చేయి అందిస్తానని మాత్రం కలలో కూడా ఊహించలేదు' అంటూ ఎలేష్ ఉద్వేగంతో చెబుతున్నారు. 'గేమ్ షో ద్వారా అమ్మను ఎందుకు పెళ్లి చేసుకున్నావని నా పిల్లలు అడక్కూడదని మొదట్లో అనుకునే వాడిని. అయితే రాఖీ కా సావరియాలో పార్టిసిపెంట్ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది గేమ్ షో ఎంతమాత్రం కాదు. లక్షలాది మంది ప్రత్యక్షంగా తిలకించారు. రాఖీకి కానీ, నాకు గానీ ఇది లైవ్ అండ్ డెత్ లాంటింది' అని ఎలేష్ చెప్పుకొచ్చారు. మొదట్లో ఎలేష్ ను ఏమాత్రం ఇష్టపడని రాఖీ సోదరుడు రవికిషన్ కూడా ఆ తర్వాత ఎలేష్ వ్యవహార శైలి, రాఖీ పట్ల అతను చూపిన ఆరాధన నచ్చి అతనే ఆమెకు సరిజోడని పచ్చజెండా కూడా ఊపేశారట. ఇంకెలాంటి మార్పులు చేర్పులు లేకుంటే 'స్యయంవరం' ఉద్దేశం నెరవేరి రాఖీ-ఎలేష్ పెళ్లితో ఒకటవుతారు.
News Posted: 28 July, 2009
|