మైనేమ్ఈజ్..100 కోట్ల డీల్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ గ్లోబల్ గా కూడా తనకున్న మార్కెట్ కు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. కరణ్ జోహర్ దర్శకత్వంలో షారూక్-కాజల్ జంటగా నటిస్తున్న 'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలకు ప్లానింగ్ జరుగుతోంది. ఈ చిత్రం ఇంకా నిర్మాణంలో ఉండగానే హాలీవుడ్ కు చెందిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్ 100 కోట్ల రూపాయలకు ఈ చిత్రం మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఎగరేసుకుపోయింది. బాలీవుడ్ లో ఇంత పెద్దమొత్తానికి డిస్ట్రిబ్యూషన్ డీల్ కుదరడం ఇదే మొదటిసారి. దీంతో అమీర్ ఖాన్ 'గజనీ' చిత్రం సాధించిన డీల్ రికార్డును షారూక్ చిత్రం తిరగరాసినట్టయింది. అంతకుముందు అల్లు అరవింద్-ఐఎఫ్ఎసి నిర్మించిన 'గజనీ' (2008) చిత్రానికి 90 కోట్ల రూపాయలకు గ్లోబల్ డీల్ కుదిరితే, ఎరోస్ ఇంటర్నేషనల్ నిర్మించిన 'ఓం శాంతి ఓం' (2007) గ్లోబల్ రైట్స్ 75 కోట్లు, సింగ్ ఈజ్ కింగ్ (2008) 60 కోట్లు, వెల్ కమ్ (2007) 45 కోట్లు డీల్ జరిగింది.
'మై నేమ్ ఈజ్ ఖాన్' చిత్రాన్ని జోహర్, ఖాన్ సంయుక్తంగా 55 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 9/11 టెర్రరిస్టు దాడుల నేపథ్యంలో అమెరికాలో నివశిస్తున్న ఇండియన్ ముస్లింపై ఎలాంటి ప్రభావం పడిందనే కథాశంతో ఈచిత్రం తెరకెక్కుతోంది. షారూక్-కాజల్ జంట చాలాకాలం తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండటం, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహర్ స్వీయదర్శకత్వంలో నిర్మిస్తుండటంతో సహజంగానే భారీ అంచానాలు ఇప్పటికే నెలకొన్నాయి. సినీ వర్గాల సమచారం ప్రకారం...రూపర్ట్ మర్దోక్ ఫాక్స్ అండ్ టీవీ నెట్ వర్క్ కు చెందిన ఫ్యాక్స్ స్టార్, కరణ్ ధర్మ ప్రొడక్షన్ ఇప్పటికే పలు బాలీవుడ్ లో పలు చిత్రాల నిర్మాణానికి గాను చెరో 50 శాతం భాగస్వామ్యంతో డీల్ కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నాయి. 'మై నేమ్ ఈజ్ ఖాన్' డిస్ట్రిబ్యూషన్ ఆ దిశగా వేసిన తొలి అడుగుగానే విశ్లేషకులు చెబుతున్నారు. 'మై నేమ్ ఈజ్..' డీల్ విషయమై ఫాక్స్ స్టార్ స్టూడియో డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్ హెడ్ వివేక్ కృష్ణానీని సంప్రదించినప్పుడు, సినిమా రైట్స్ కోసం చర్చలు జరుపుతున్న విషయం నిజమేననీ, అయితే డీల్ కుదిరిందా అనేది తనకు తెలియదనీ చెప్పారు. ఫాక్స్ స్టార్ స్టూడియో ఇప్పటికే ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ 'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రాన్ని ఇండియాలో పంపిణీ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. హిందీ, తమిళ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలతో కలిపి కొన్ని కాంట్రాక్టులు కూడా కుదుర్చుకుంది.
News Posted: 28 July, 2009
|