ఆసిన్ ఇల్లు అమ్మకానికి?!
దక్షిణాదిన మంచి డిమాండ్ లో ఉండగానే హిందీ 'గజనీ'తో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్ దక్కించుకున్న ఆసిన్ ఇప్పుడు ముంబైలోనే సెటిల్ అయింది. ఇటీవలే సొంత అపార్ట్ మెంట్ లోకి కూడా అడుగుపెట్టింది. ఆసిన్ తల్లిదండ్రులు కూడా ఆ పక్కనే మరో ఆపార్ట్ మెంట్లో సెటిల్ అయ్యారు. ఆసిన్ రొటీన్ గానే మళ్లీ కోలీవుడ్ వస్తాననీ, మంచి స్క్రిప్టు కోసం ఎదురుచూస్తున్నానని చెబుతున్నా...చెన్నైలోని హారింగ్ టన్ రోడ్డులో ఉన్న సొంత అపార్ట్ మెంట్ ను అమ్మకానికి పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు కోడంబాక్కం వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి.
ఆసిన్ మలయాళీ ముద్దుగుమ్మ అయినప్పటికీ తమిళ చిత్రాలే మంచి పేరు తెచ్చిపెట్టాయి. విజయ్ తో 'పోక్కిరి', సూర్యతో 'గజనీ' చిత్రాలు ఆమె కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చాయి. 'దశావతారం' చిత్రం ఆసిన్ ను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకెళ్లింది. అమీర్ ఖాన్ తో బాలీవుడ్ లో ఛాన్స్ రావడంతో అక్కడకు ల్యాండ్ అయిన ఆసిన్ హిందీ 'గజనీ'లో ఆయనతో కలిసి నటించింది. ఆ చిత్రం 100 కోట్లకు పైగా రాబట్టి బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో ఆసిన్ కు అక్కడ వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సల్మాన్ ఖాన్ 'లండన్ డ్రీమ్స్' లో ప్రస్తుతం నటిస్తోంది. హిందీ చిత్రాల్లో కెరీర్ ఉజ్వలంగా కనిపిస్తుండటంతో ఇటీవలే ఆసిన్ ముంబైకి మకాం మార్చింది. దీంతో ఆసిన్ కోలీవుడ్ కు తిరిగొచ్చే అవకాశాలు అంతంతమాత్రమేననీ, ఇందులో భాగంగానే చెట్ పట్ లోని తన అపార్ట్ మెంట్ ను అమ్మకానికి పెట్టాలనుకుంటోందనీ పలువురు అనుకుంటున్నారు. శ్రియ సైతం ఈమధ్యనే బాలీవుడ్ తలుపుతట్టినా ఫ్లాపుల కారణంగానే వెనక్కి తిరిగి వచ్చి తమిళ సినిమాల్లో మళ్లీ బిజీ అయింది. ఆసిన్ తొలి సక్సెస్ చవిచూడటంతో ఇప్పట్లో మళ్లీ వెనక్కి రాకపోవచ్చంటూ ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు.
News Posted: 29 July, 2009
|