మళ్లీ 'దేవదాసు' జోడీ
కాలమే అన్నిగాయాలనూ మాన్పుతుందంటారు. ఐశ్వర్యారాయ్, షారూక్ ఖాన్ జంట చూడముచ్చటగా ఉంటుందని 'దేవదాసు' (2002) సినిమా చూసిన ఎవరైనా చెబుతారు. ఆ సినిమా విడుదలైన ఏడాది తర్వాత వచ్చిన 'ఛల్తే ఛల్తే' ఈ జంట మధ్య వైరాన్ని పెంచింది. కొంత భాగం షూటింగ్ జరిపిన తర్వాత ఐశ్వర్యను ఆ సినిమా నుంచి తప్పించడం, సల్మాన్ ఖాన్ సెట్స్ లోకి వచ్చినప్పుడు కొంత రగడ జరగడం వంటి చేదు సంఘటనలు అప్పట్లో చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత అమితాబ్-షారూక్ ల మధ్య అభిప్రాయభేదాలు కూడా ఐష్ ను షారూక్ కు దూరంగా ఉండేలా చేశాయి. ఐష్-అభిషేక్ పెళ్లికి కూడా షారూక్ ను బిగ్ బి ఆహ్వానించలేదు. అయితే ఇటీవల కాలంలో షారూక్, ఆయన భార్య గౌరి కొద్దిపాటి చొరవ చూపించి బచ్చన్ ఫ్యామిలీ సభ్యులకు దగ్గరవుతూ వచ్చారు. గత ఏడాది 'ద్రోణ' ప్రీమియర్ షో లో షారూక్ జంట పాల్గొని బచ్చన్లతో ఫోటోలు దిగారు. ఈమధ్యనే కరణ్ జోహర్ బర్త్ డే పార్టీలో ఐష్-అభి, షారూక్-గౌరీ జంటలు అరమరికలు లేకుండా కలిసిపోయారు. ఈ క్రమంలో షారూక్-ఐశ్వర్య జంటను మరోసారి వెండితెరపై కలిపేందుకు దర్శకుడు రాజీవ్ మీనన్ పావులు కదుపుతున్నారు.
తమిళంలో ఐశ్వర్య, టబూతో 'కండుకొండేన్ కండుకొండేన్' చిత్రాన్ని అప్పట్లో రాజీవ్ మీనన్ తీశారు. ఐశ్వర్య-షారూక్ జంటను దృష్టిలో పెట్టుకుని ఇటీవల ఓ అద్భుతమైన స్క్రిప్టును రెడీ చేసిన మీనన్ లండన్ వెళ్లి షారూక్ కు స్క్రిప్టు వినిపించారు. ఆ స్క్రిప్టు షారూక్ ను సైతం ఎంతగానో ఆకట్టుకుందట. 'దేవదాసు' తరహా డ్రమటిక్ ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్న షారూక్ ఈ చిత్రంలో ఐశ్వర్యతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారు. ఇక ఐష్ ఒప్పుకోలే తరువాయని చెబుతున్నారు. రాజీవ్ మీనన్ ప్రయత్నాలు ఫలిస్తే బాలీవుడ్ లో పవర్ ఫుల్ ఫ్యామలీస్ గా పేరున్న ఖాన్-బచ్చన్ల మధ్య స్నేహవారధి పడినట్టే...
News Posted: 1 August, 2009
|