ఎలేష్ ను వరించిన రాఖీ
నెలరోజులుగా అనేక మలుపులు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తించిన బుల్లితెర తొలి 'స్వయంవరం' రియాలిటీ షో కు తెరపడింది. ఈ ప్రత్యక్ష 'స్వయంవరం'లో బాలీవుడ్ గాళ్ రాఖీ సావంత్ తన జీవిత భాగస్వామిగా కెనడా వ్యాపారవేత్త ఎలేష్ పరుజన్ వాలాను ఎంపిక చేసుకుంది. ఎన్టీటీవీ ఇమేజిన్ ద్వారా ప్రసారమైన 'రాఖీ కా స్వయంవర్' రియాల్టీ షో లో ముగ్గురు యువకులు ఫైనల్ కు చేరుకున్నారు. ఎలేష్ తో పాటు ఢిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజర్ మానస్ కాత్వాల్, చితిజ్ జైన్ పోటీపడ్డారు. రాఖీ ఎవర్ని వరిస్తుందో అని ఆదివారంనాడు ఈ ప్రోగ్రాంను వీక్షిస్తున్న వారంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. నీతూ లుల్లా డిజైన్ చేసిన ఎరుపు-బంగారు రంగుల గాగ్రా చోళీ ధరించి నవ వధువులా ముస్తాబైన రాఖీ ఎలేష్ మెడలో పూలమాల వేసి జీవిత భాగస్వామిని ఎంచుకుంది. పరస్పరం 'ఐ లవ్ యూ' చెప్పుకుని ఉంగరాలు మార్చుకున్నారు.
తన జీవిత భాగస్వామిగా ఎలేష్ ను ఎంచుకోవడంపై రాఖీ మాట్లాడుతూ, మొదటి రోజు నుంచి ఎలేష్ ను తాను గమనిస్తూనే ఉన్నాననీ, కెమెరా ముందు, సాధారణ పరిస్థితుల్లోనూ ఎలేష్ తన గురించి బాగా శ్రద్ధ చూపించాడనీ, భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలని తాను కోరుకున్నానో అవన్నీ అతడిలో ఉన్నాయనీ పేర్కొన్నారు. ఈరోజు తమ నిశ్చితార్ధం జరిగిందనీ, పెళ్లి చేసుకువడానికి తానిప్పుడు సిద్ధంగానే ఉన్నాననీ చెప్పారు. అయితే పెళ్లికి ముందు తాను, ఎలేష్ ఒకరినొకరు మరింత అర్థం చేసుకోవాల్సి ఉందనీ, త్వరలోనే అందరి సమక్షంలో సాంప్రదాయబద్ధంగా తమ పెళ్లి జరుగుతుందనీ రాఖీ వివరించింది. ఎట్టకేలకు రాఖీ తన మదిదోచిన ఎలేష్ ను వరించడంతో 'స్యయంవరం' రియాలిటీ షో కు శుభం కార్డు పడింది.
News Posted: 3 August, 2009
|