'స్లమ్ డాగ్'కు ఎంపీల సన్మానం
న్యూఢిల్లీ: ఎనిమిది ఆస్కార్ అవార్డులతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రం ఆర్టిస్టులను లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ సోమవారంనాడు ఘనంగా సన్మానించారు. అంతకుముందు పార్లమెంటు ఉభయ సభల సభ్యుల కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు అధిగిమించేందుకు ఈ చిత్రం అందరికీ స్ఫూర్తినిస్తుందని మీరాకుమార్ ఈ సందర్భంగా ప్రశసించారు. మురికి వాడల్లో నివసిస్తున్న పిల్లల జీవితాలను కించపరచేలా ఈ చిత్రం ఉందనే విమర్శలు సహేతుకం కాదన్నారు. సినిమా చాలా బాగుందనీ, మనసు అంతరాళను సూటిగా తాకిందని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా గౌరవం అందుకున్న మన కళాకారులను పార్లమెంటు సముచిత రీతిన సత్కరించుకుంటోందని ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. ప్రతిభావంతులను, వారి సేవలను గుర్తించే సరైన వేదిక పార్లమెంటు అని అన్నారు.
ఇదొక అనిర్వచనీయమైన అనూభూతనీ, తన సంగీతాన్ని జనం ఆదరించడం తనకెంతో సంతోషం కలిగిస్తోందనీ ఎ.ఆర్.రెహ్మాన్ వ్యాఖ్యానించారు. ఇది ప్రారంభం మాత్రమేననీ, ఇంకా చాలా సాధించాల్సి ఉందనీ పేర్కొన్నారు. ఎంపీల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక ప్రదర్శనకు రెహ్మాన్ తో పాటు చిత్ర గీత రచయిత గుల్జార్, సౌండ్ ఇంజనీర్ రసూల్ పోకుట్టిలు హాజరయ్యారు. వీరందరినీ మీరాకుమార్ సత్కరించారు. రాష్ట్రపతి ప్రతిబా పాటిల్ సైతం ఆదివారంనాడు రాష్ట్రపతి భవన్ లో 'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రాన్ని తిలకించారు.
News Posted: 4 August, 2009
|