అంబానీపై 200 కోట్ల దావా
వినోదం వెనుక ఊహించని ఉత్పాతం కూడా ఉండొచ్చని బిగ్ ఎం.ఎఫ్. 92.7 రేడియో స్టేషన్ కు తాజా చేదు అనుభవం ఎదురైంది. 'సన్ సన్నీ' అనే పేరుతో బిగ్ ఎఫ్.ఎం. ప్రసారం చేస్తున్న 'సన్ సన్నీ' ప్రోగ్రాం చీప్ కామెడీ, బ్యాడ్ టేస్ట్ తో ఉండటం సన్నీడియోల్ ను తీవ్ర మనస్థాపానికి గురిచేసిందంటూ ఆయన తరఫు లాయర్ అశోక్ సరౌగి సదరు రేడియో స్టేషన్ కు పరువునష్టం నోటీసు పంపారు. సన్నీతో పాటు అతని తండ్రి, సోదరులను అప్రతిష్టపాలు చేసే విధంగా ఈ ప్రోగ్రాం ఉందనీ, తననూ, తన తండ్రిని గుర్తు చేసే మిమిక్రీతో చీప్ కామెడీ సృష్టించడం సన్నీడియోల్ ను దిగ్భ్రాంతికి గురిచేసిందని అశోక్ సరౌగి ముంబైలో తెలిపారు.
సన్నీ ఈ షోలో పాల్గొన్నాడనే అభిప్రాయం కలిగించేలా ఆయన వాయిస్ ను అనుకరించడంతో సన్నీ తీవ్ర మనస్థానం చెందినట్టు ఆయన చెప్పారు. తమ రెప్యుటేషన్ ను దెబ్బతీసినందున వారం రోజుల్లో 200 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సిందిగా రేడియో స్టేషన్ కు నోటీసు పంపినట్టు తెలిపారు. జూలై 31న అనిల్ అంబానీ, తరుణ్ కత్యాల్, అశుతోష్ ఖన్నా, బిగ్ ఎఫ్ఎం 92.7, రిలయెన్స్ బిగ్ ఎంటర్ టైన్ మెంట్ లకు లీగల్ నోటీసు పంపినట్టు చెప్పారు. వారంలోగా స్పందించని పక్షంలో వారిపై ముంబై హైకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. సెక్షన్ 499 (పరువునష్టం), సెక్షన్ 500 (పరువునష్టానికి శిక్ష) కింద కేసులు వేయనున్నట్టు చెప్పారు. రేడియో స్టేషన్ లో షో ప్రసారం తర్వాత తన క్లయింట్ ఎక్కడకు వెళ్లినా ఆయనపై తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారనీ, ఆయనను గౌరవంగా చూడటం లేదనీ పేర్కొన్నారు. పలువురు నిర్మాతలు కూడా ఆఫర్లు ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నట్టు చెప్పారు. పాపులర్ హీరో ఇమేజ్ ఉన్న వ్యక్తులను చీప్ కామెడీతో చూపించడం తగదనీ, తన క్లయింట్ గౌరవానికి తీవ్ర నష్టం జరిగిందనీ ఆయన తన నోటీసులో స్పష్టం చేశారు. కాగా, మిమిక్రీకి తాను వ్యతిరేకం కాదనీ, అయితే అది అసహ్యంగా ఉండకూడదనీ సన్నీ డియోల్ పేర్కొన్నారు. షో కంటెంట్ వివరాల్లోకి తాను వెళ్లదలచుకోలేదనీ, అయితే ఈ షో తనను రెచ్చగొట్టి, తీవ్ర ఆవేదన కలిగించిందనీ చెప్పారు.
News Posted: 6 August, 2009
|