బిచ్చగాడికి సల్మాన్ పావులక్ష
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/salman9.jpg' align='right' alt=''>సల్మాన్ కండలు తిరిగిన శరీరం వెనుక సుతిమెత్తని మనసు కూడా ఉంది. ఆయన మనసు బంగారమని ఆయనను దగ్గరగా పరిశీలించిన పలువురు చెబుతుంటారు. సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన తన ఔదార్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు. సల్మాన్ మానవత్వానికి మరో మ(మె)చ్చు తునక లాంటి సంఘటన ఇటీవల చోటుచేసుకుంది. ఫుట్ పాత్ మీద కనిపించిన ఓ బిచ్చగాడిని గుర్తుపట్టిన సల్మాన్ వెంటనే తన పర్సులోని సొమ్ము అతని చేతిలో పెట్టారు. ఆకలితో ఉన్న అతనికి ఆహారం, కొత్త దుస్తులు ఇచ్చి మనుషుల్లో ఇంకా మానవత్వం మసిబారలేదని చాటారు.
బోనీకపూర్ నిర్మిస్తున్న 'వాంటెడ్' చిత్రం షూటింగ్ ఇటీవల బాంద్రా ఫోర్ట్ వద్ద జరుగుతోంది. ఆ షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా అక్కడ వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఓ వ్యక్తిని సల్మాన్ చూశారు. వెంటనే కారు దిగి నేరుగా అతని వద్దకు వెళ్లి చాలాకాలం క్రితం బాంద్రాలోని బాండ్ స్టాండ్ వద్ద గాలిపటాలు అమ్మే వ్యక్తి అతనేనా కాదా అని నిర్దారణ చేసుకున్నారు. ఆశ్యర్యంగా ఆనాడు తనకు గాలిపటాలు అమ్మిన వ్యక్తి అతనే కావడంతో సల్మాన్ చలించిపోయారు. సల్మాన్ బాల్యం బాంద్రా స్టాండ్ వద్దే ఎక్కువగా గడిచింది. అక్కడ గాలిపటాలు ఎగరేసిన రోజులు ఆయన ఇప్పటికీ మరచిపోలేదు. ఆనాడు గాలిపటాలు అమ్మే వ్యక్తి ఆ తర్వాత 20 ఏళ్లుగా సల్మాన్ కంటపడనే లేదు. అనుకోని విధంగా ఆ వ్యక్తి మళ్లీ తన కంటపడటం, అదీ బిచ్చగాడి అవతారంలోని అతన్ని చూడటం సల్మాన్ మనసును కదిలించి వేసింది. వెంటనే అతనికి మంచి ఆహారం, దుస్తులు తెప్పించి ఇచ్చారు. తన పర్సులో ఉన్న 25,000 రూపాయలు అతని చేతిలో పెట్టి తన పెద్దమనసును చాటుకున్నారు. సల్మాన్ ఔదార్యం చూసిన ఆ బిచ్చగాడు సంబరంతో ఉబ్బితబ్బిబయ్యారు. సల్మాన్ కు పరిపరి విధాల కృతజ్ఞతలు చెప్పుకున్నారు. సల్మాన్ మనసు వెన్న అనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేననీ, నిజానికి ఆయన 'సల్మాన్ ఖాన్ ఫౌండేషన్' ద్వారా పలు సామాజికి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ, ఎందరో స్లమ్ చిల్ట్రన్, అనాథలు, వికలాంగులను ఆదుకుంటున్నారని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు. సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించే సల్మాన్ ను కొందరు 'బ్యాడ్ బాయ్'గా ముద్రవేయడం దురదృష్టకరమనీ, ఆయన చాలా మంచి వ్యక్తనీ, మనసున్న మారాజనీ ఆయన అభివర్ణించారు.
News Posted: 11 August, 2009
|