రాణి రాశి మారేనా?!
బాలీవుడ్ నటి రాణిముఖర్జీకి సక్సెస్ ముఖం చాటేసే రెండేళ్లయింది. తన రాశి బాగోలేకపోవడమే ఇందుకు కారణంగా రాణి నిష్టురాలాడుతూ ఉండొచ్చు. అయినా విధిని తప్పించడం ఎవరికి మాత్రం సాధ్యమవుతుంది? అలాగని రాణి బాయ్ ఫ్రెండ్ ఆదిత్య చోప్రా చూస్తూ ఉండగలడా? అందుకోసమే రాణి నటించిన 'దిల్ బోలో హడిప్పా' చిత్రాన్ని రాణికి గడ్డుకాలం పూర్తయిన తర్వాతే విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. ఆప్రకారం సెప్టెంబర్ 9వ తేదీన 'దిల్ బోలో హడిప్పా' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'లగా చునరి మే దాగ్', 'త ర రుమ్ పుమ్', 'థోడా ప్యార్ థోడా మ్యాజిక్' వంటి వరుస ఫ్లాపుల తర్వాత రాణీ చేతిలో ప్రస్తుతం 'దిల్ బోలే హడిప్పా' చిత్రం మాత్రమే ఉంది. ఆదిత్య చోప్రా నిర్మాణ సంస్థకు, యష్ రాజ్ ఫిలిమ్స్ కు మినహాయిస్తే ఇతర బ్యానర్లకు ఒకింత దూరంగానే ఉంటోంది. ఈ తరుణంలో రాణి కెరీర్ కు 'దిల్ బోలే..' చిత్రం కీలకం కాబోతోంది. రాశి బాగోలేక రెండేళ్లుగా ఇక్కట్లు పడుతున్న రాణికి సెప్టెంబర్ 9తో మంచిరోజులు రాబోతున్నాయనీ, తొలుత ఈ చిత్రాన్ని ఆగస్టు చివర్లో కానీ, సెప్టెంబర్ మొదటివారంలో కానీ ఆదిత్య చోప్రా విడుదల చేయాలనుకున్నప్పటికీ ఇప్పుడు సెప్టెంబర్ 9వ తేదీకి విడుదల తేదీని వాయిదా వేశారనీ రాణి సన్నిహితులు తెలిపారు. యష్ రాజ్ ఫిలిమ్స్ సైతం ఈమధ్య కొన్ని బాక్సాఫీస్ వైఫల్యాలు చవిచూసినప్పటికీ ఇటీవల 'న్యూయార్క్' చిత్రంతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చింది. అయినప్పటికీ 'ఫేట్'తో ఆటలాడుకోవడం మంచిది కాదని చోప్రా సైతం నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. నిరీక్షణకు మంచి ఫలితం దక్కుతుందనే ఆశిద్దాం.
News Posted: 18 August, 2009
|