ఎల్డామ్స్ రోడ్డుకు కమల్ పేరు
విలక్షణ నటుడు పద్మశ్రీ కమల్ హాసన్ కు నటుడిగా ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్. ఐదు దశాబ్దాల నట ప్రస్థానంలో ఎన్నో విలక్షణ పాత్రలు, బహుభాషా చిత్రాలు, సూపర్ హిట్లతో దక్షిణాది ప్రేక్షకులనే గాకుండా దేశవ్యాప్తంగా ఎందరో అభిమానులను కమల్ సంపాదించుకున్నారు. ఆయన గోల్డెన్ జూబ్లీ ఇయర్ ను చెన్నై, కర్ణాటక తదితర ప్రాంతాల్లో అభిమానులు, పరిశ్రమ వర్గాలు ఎంతో ఘనంగా ఇటీవల జరుపుకొన్నాయి. భారత సినీ పరిశ్రమ గర్వించదగిన నటుడైన కమల్ పేరును సుస్థిరం చేసేందుకు పరిశ్రమ వర్గాలు ఎవరికి తోచిన ప్లాన్స్ తో వారు ముందుకు వెళ్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర సంఘం ఇలాంటి వినూత్న ఆలోచనతోనే ముందుకు వచ్చింది. చెన్నైలోని ఎల్డామ్స్ రోడ్డు పేరును డాక్టర్ కమల్ హాసన్ రోడ్డుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి పరిశ్రమ ప్రముఖులంతా తగిన ప్రయత్నాలు తీసుకోబోతున్నట్టు నడిగర సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్ తెలిపారు.
కమల్ హాసన్ ఇదే రోడ్డులో చాలా ఏళ్లుగా ఉంటున్నారనీ, ఆ రోడ్డుకు ఆయన పేరు పెట్టడం ద్వారా స్వర్ణోత్సవ శుభవేళ కమల్ కు ఇచ్చే సరైన కానుక అవుతుందని నడిగర సంఘం భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామనీ, ముఖ్యమంత్రి కరుణానిధిని కలస్తామనీ తెలిపారు. సినీ వైభవానికి 50 ఏళ్లుగా చేస్తున్న కమల్ చేస్తున్న కృషిని మనమంతా గౌరవించుకునే తరుణమిదనీ, ఆల్వార్ పేటలోని ఎల్డామ్స్ రోడ్డుకు కమల్ హాసన్ రోడ్డుపై పేరు మార్చడం సముచితంగా ఉంటుందనీ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ వ్యాఖ్యానించారు. కమల్ అభిమానులకు కూడా ఇది నిజంగానే గ్రేట్ న్యూస్.
News Posted: 19 August, 2009
|