మల్లికకు అరుదైన గౌరవం
లాస్ ఏంజల్స్: బాలీవుడ్ సంచలన నటి మల్లికా షెరావత్ కు అరుదైన గౌరవం దక్కింది. లాస్ ఏంజెల్స్ హానరరీ సిటిజన్ షిప్ ఆమెను వరించింది. లాస్ ఏంజెల్స్ సిటీ హాల్ లో జరిగిన భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆమెను హానరరీ సిటిజన్ షిప్ గౌరవంతో సత్కరించారు. ఒక భారతీయ నటికి హాలీవుడ్ నుంచి ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. సిటీ హాల్ కౌన్సిల్ చాంబర్స్ లో కౌన్సిల్ మెంబర్ జోష్ హుయిజర్ చేతుల మీదుగా ఈ గౌరవ పురస్కారాన్ని మల్లికా షెరావత్ అందుకున్నారు.
లాస్ ఏంజెల్స్ హానరరీ సిటిషన్ పిష్ గౌరవం అందుకుంటూ మల్లిక ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఇలాంటి అరుదైన గౌరవం తనకు లభించినందుకు చాలా గర్వంగా ఉందనీ, ఇందుకు గాను కౌన్సిల్ మెంబర్ హుయిజర్, మేర్ విల్లరగోస, మేయర్ రియోర్డన్, సిటీ కౌన్సిల్ సభ్యులందరికీ తన కృతజ్ఞతలని పేర్కొన్నారు. లాస్ ఎంజెల్స్ హానరరీ సిటిజన్ షిప్ పొందిన తొలి బాలీవుడ్ నటిగా తనకు దక్కిన ఈ గౌరవం తన మాతృదేశానికి, ఎంతగానో ప్రేమించే బాలావుడ్ కూ చెందుతుందని ఆమె అన్నారు. రెండు దేశాలు మధ్య ఉన్న ప్రత్యేక మిత్రత్వం ఇలానే కొనసాగాలనీ, అలాగే బాలీవుడ్, హాలీవుడ్ చిత్ర పరిశ్రమలు రెండూ కళలు, వినోదాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా సాగాలని కోరుకుంటున్నాననీ అన్నారు. జై హో..లైస్ ఏంజెల్స్ అంటూ ముక్తాయింపు ఇవ్వడంతో సిటీహాలులో కరతాళ ధ్వనులు మారుమోగాయి. మల్లికా షెరావత్ కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
News Posted: 20 August, 2009
|