రజనీని అడ్డుకున్న పోలీసులు
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/rajanee.jpg' align='right' alt=''>చెన్నైలోని నడిగర సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ కు చేదు అనుభవం ఎదురైంది. ప్రవేశ ద్వారం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లోపలకు వెళ్లకుండా నిరోధించారు. దీంతో అక్కడి వాలంటీర్లు జోక్యం చేసుకుని ఆయనను లోపలకు అనుమతించారు. అయితే రజనీకాంత్ ఇదో మెమరబుల్ ఎక్స్ పీరియన్స్ గా గుర్తు పెట్టుకున్నారే కానీ కిమ్మనలేదు. ఎందుకంటే...అప్పుటికింకా రజనీకాంత్ సూపర్ స్టార్ కాదు మరి. 1979లో చోటుచేసుకున్న ఈ సంఘటనను చెన్నైలో ఈనెల 15 నుంచి జరుగుతున్న సౌత్ ఇండియన్ నడిగర సంఘం స్టేజ్ డ్రామాల ఫంక్షన్ కు చివరి రోజైన ఆదివారంనాడు హాజరైన రజనీకాంత్ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా నడిగర సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్, సెక్రటరీ రాథా రవి కలిసి 'వెట్రి వెట్రి వెట్రి' అనే స్టేజ్ ప్లే ప్రదర్శించారు. రజనీకాంత్ అలనాటి ప్రముఖ నటి ఎం.ఎన్.రాజ్యం, అంజలీదేవికి నడిగర సంఘం తరఫున అవార్డులను ప్రదానం చేశారు.
ఇదే సందర్భంలో రజనీకాంత్ గత స్మృతులను నెమరువేసుకుంటూ, అప్పట్లో నడిగర సంఘం భవనం ప్రారంభోత్సవానికి ఎం.జి.రామచంద్రన్ అధ్యక్షత వహించారనీ, తనను గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నప్పుడు వాలంటీర్ల చొరవతో ఎలాగో లోపలకు వెళ్లగలిగాననీ, శివాజీ గణేషన్ ప్రదర్శించిన 'అశోక్ చక్రవర్తి' స్టేజ్ ప్లేను ఒక మూలన నిలబడి మరీ తిలకించాననీ రజనీకాంత్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత క్రమంలో స్టేజ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన తాను ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో రెండేళ్ల పాటు శిక్షణ పొందాననీ, దర్శకుడు కె.బాలచందర్ తనను చూసి కెమెరా ముందు ఎలా నటించాలో నేర్పించారనీ రజనీ గుర్తుచేసుకున్నారు. నడిగర సంఘానికి టి.నగర్ లో 18 గ్రౌండ్ ల ల్యాండ్ ఉందనీ, బిల్డింగ్ లు, థియేటర్లు నిర్మించినట్లయితే నెలకు కోట్లాది రూపాయలు ఆదాయం వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఆ దిశగా చొరవ తీసుకోవాలని సూచన చేశారు. నడిగర సంఘం అభివృద్ధికి ఎం.జి.ఆర్, శివాజీ, విజయకాంత్, శరత్ కుమార్, రాధారవి తదితరులు విశిష్ట సేవలు అందించారని ప్రశంసించారు.
News Posted: 25 August, 2009
|