జాతీయ అవార్డుకు ఖాన్ ల పోటీ

న్యూఢిల్లీ: ఏటా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డుల రేసులో ఖాన్ హీరోలు ముఖాముఖీ తలపడుతున్నారు. 2007 - జాతీయ అవార్డుల రేసులో ఉత్తమ నటుడి కేటగిరిలో షారూక్ ఖాన్, అమీర్ ఖాన్ లు నామినేట్ అయ్యారు. 'చక్ దే ఇండియా'లో ఇండియన్ కోచ్ గా మహిళా టీమ్ కు సారథ్యం వహించి వరల్డ్ ఛాంపియన్ షిప్ ను దేశానికి దక్కించిన కబీర్ ఖాన్ పాత్ర పోషణకు గాను ఉత్తమ నటుడి అవార్డుకు షారూక్ నామినేట్ అయ్యారు. అమీర్ ఖాన్ 'తారే జమీన్ పర్' చిత్రంలో స్కూల్ మాస్టర్ పాత్రకు గాను ఉత్తమ నటుడి కేటగిరిలో పోటీ పడుతున్నారు. డెస్లిక్సిక్ సమస్యతో బాధపడుతున్న విద్యార్థికి (దర్శీల్ సఫ్రీ) సహకరించే ఉదాత్తమైన పాత్రను అమీర్ ఈ చిత్రంలో పోషించారు. అమీర్, షారూక్ లు ఇంతవరకూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకోకపోవడం విశేషం. వచ్చే వారంలో ఈ జాతీయ అవార్డులను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అంబికా సోని ప్రకటించనున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా అక్టోబర్ లో అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది.
'తారే జమీన్ పర్' చిత్రంలో నటనకు గాను ఉత్తమ బాలనటుడి కేటగిరిలో దర్శీల్ సైతం నామినేట్ అయ్యాడు. ఇదే చిత్రానికి ఉత్తమ నిర్మాత కేటగిరిలో అమీర్ ఖాన్ బరిలో ఉండగా, ఉత్తమ చిత్రం కేటగిరిలోనూ ఈ చిత్రం పోటీపడుతోంది. షారూక్ సొంత బ్యానర్ చిత్రమైన 'ఓం శాంతి ఓం' చిత్రం కూడా బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో నామినేట్ అయింది. సాహిద్ కపూర్- కరీనా కపూర్ 'జబ్ ఉయ్ మెట్' సైతం ఇదే కేటగిరిలో పోటీ ఇస్తోంది. జాతీయ అవార్డుల కోసం 100కు పైగా బాలీవుడ్, ప్రాంతీయ చిత్రాలు పోటీ పడగా, వివిధ కేటగిరిలో సుమారు 30 సినిమాలను జ్యూరీ షార్ట్ లిస్ట్ చేసింది. 2005లో డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఆనంద్ పట్వర్ధన్ అవార్డుల ఎంపికను కోర్టులో సవాలు చేయడంతో ఏడాది ఆలస్యంగా అవార్డుల ప్రదానం జరుగుతోంది. ఆ ప్రకారం 2007కు సంబంధించిన జాతీయ అవార్డులను ఈ ఏడాది ప్రదానం చేయనున్నారు. అవార్డుల జ్యూరీకి ఫిల్మ్ మేకర్ సాయి పరాంజపే సారధ్యం వహించారు.
News Posted: 26 August, 2009
|