'న్యూఇయర్'లో బిగ్ బి లేరు
'ఓం శాంతి ఓం' చిత్రం తర్వాత షారూక్ ఖాన్, కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ఫరాఖాన్ కలిసి 'హ్యాపీ న్యూ ఇయర్' చిత్రం కోసం పనిచేయబోతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, షారూక్ కలిసి నటించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనికి ఆదిలోనే ఫరాఖాన్ కళ్లెం వేశారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదనీ, తన బెస్ట్ ఫ్రెంట్ షారూక్ ఖాన్ మాత్రమే ఇంతవరకూ ఈ చిత్రానికి ఎంపికయ్యారనీ, ప్రస్తుతం ఇంకా స్క్రిప్టు వర్క్ జరుగుతోందనీ ఆమె తేల్చిచెప్పారు.
'ఇందులో అమితాబ్ నటించనున్నారనే వదంతులను నమ్మాల్సిన పనిలేదు. షారూక్ ను మినహాయిస్తే ఇంకెవర్నీ ఇంతవరకూ ఎంపిక చేయలేదు. ప్రసుతానికి అయితే షారూక్, నేనూ మాత్రమే ఈ చిత్రంలో ఉన్నాం' అంటూ ఫరా నవ్వుతూ చెప్పారు. సంజయ్ దత్, జావెద్ ఖాన్, జూవీచావ్లా కూడా ఈ చిత్రంలో నటించనున్నట్టు వస్తున్న ఊహాగానాలను కూడా కొట్టేశారు. ఈ చిత్రం చాలా మోడ్రన్ గా, సమకాలీన పరిస్థితులకు అద్దంపట్టేలా ఉంటుందనీ, ఈ ఏడేదే సెట్స్ పైకి తీసుకు రావాలని అనుకుంటున్నామనీ చెప్పారు. ప్రస్తుతం తాను పనిచేస్తున్న ఛాట్ షో షూటింగ్ పూర్తికాగానే తిరిగి స్క్రిప్టు వర్క్ పని చేపడతాననీ ఫరా తెలిపారు. అన్న్టటు...షారూక్-అమితాబ్ చివరిసారిగా 'భూత్ నాథ్' చిత్రంలో కలిసి నటించారు.
News Posted: 27 August, 2009
|