సల్మాన్ తువ్వాలు వెర్రి

వెర్రి వేయి విధాలని, ఎవడి వెర్రి వాడికి ఆనందమని మనందరికీ తెలుసు. సెలబ్రిటీలు వాడి పాడేసిన సామాన్లను కొట్లు కుమ్మరించి కొనుక్కోవడం కూడా వేయి విధాల వెర్రిలో ఒకటని అంటుంటారు. కష్టపడి సంపాదించిన సొమ్మును సినిమాతారల వాడి వదిలేసిన చెప్పులను, బ్రాలను, చెడ్డీలను వేలంలో సొంతం చేయడానికి తగలెట్టడం ఒక ఫ్యాషన్. అలా వచ్చిన సొమ్మును పేదలను ఆదుకోడానికి ఖర్చ పెట్టడమే ఈ వెర్రిలో కూడా ఆనందాన్ని మిగిల్చే అంశం. అదిగో అలాంటి వేలం వెర్రి వాళ్లకు ఇప్పుడు బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ వాడి, పదిలంగా దాటుకున్న పసుపు తువ్వాలు దొరికింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. తాజాగా సల్మాన్ తాను ఎంతగానో ఇష్టపడే ఓ టవల్ ను వేలం పెట్టారు. కేవలం కొద్ది గంటల్లోనే ఆ టవల్ లక్షా 54 వేల మూడు రూపాయల ధర వద్ద వేలం నిలిచింది. ఈ వేలం ఆగస్టు 30 వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ముగుస్తుందని వేలం నిర్వహిస్తున్న ఇ-బే ప్రతినిధులు చెప్పారు. ఇప్పటి వరకూ 2280 మంది దీనిని చూశారని, 53 మంది వేలంలో పాల్గొన్నారని వివరించారు. ఎక్కువ మంది హంగ్ కాంగ్, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ దేశాల్లోని సల్మాన్ అభిమానులు వేలంలో పాల్గొంటున్నారని తెలిపారు.
'తేరే మేరే బీచ్ మే' అనే సరికొత్త ఛాట్ షో లో తొలి సెలబ్రెటీ గెస్ట్ గా సల్మాన్ హాజరైనప్పుడు ఈ టవల్ ను వేలం పెట్టారు.పసుపురంగులో ఉండే ఈ టవల్ ను 'ముఝే షాదీ కరోగి' అనే డేవిడ్ థావన్ నిర్మించిన చిత్రంలోని 'జానే కె హై చార్ దిన్' పాటలో సల్మాన్ ఉపయోగించారు. చాట్ షోకి హాజరైన ఫరా ఖాన్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. సల్మాన్ రిహార్సల్స్ కోసం వాడిన ఈ టవల్ ఆయన సొంతం కూడా. 'ఫరా జ్ఞాపకాలను పదిలం చేసే టవల్ ఇది' అని సల్మాన్ చెప్పుకొచ్చారు. నిజానికి ఈ తువ్వాలు ఖరీదు కొన్ని వందల రూపాయలు మాత్రమే ఉంటుందని, దానిని సల్మన్ వాడటమే ఇప్పుడు పలికిన ధరకు కారణమని ఇ-బే సీనియర్ మేనేజర్ థామస్ వివరించారు. వెయ్యు ఒక్క రూపాయి ప్రారంభ ధరగా ఇ-బేలో మొదలైన వేలం బుధవారం రాత్రికి లక్షన్నర రూపాయల మార్కును దాటేసిందని చెప్పారు. సూపర్ హిట్టయిన పాటలో సల్మాన్ ఈ తువ్వాలును కట్టుకుని కనిపిస్తాడు. అలానే రిహర్సిల్స్ లో కూడా సల్మాన్ దీనిని వినియోగించాడని ఫర్హాఖాన్ గుర్తుచేసుకున్నారు. టవల్ అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును స్నేహ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా అందిస్తున్నారు.
సల్మాన్ తువ్వాలు తరువాత సినీతార ప్రియాంక చొప్రా వాడిన సాయంత్రం దుస్తులు, ఒలంపిక్ స్వర్ణపతక విజేత విజేంద్ర సింగ్ వాడిన బాక్సింగ్ గ్లవ్స్ వేలానికి రానున్నాయి. అలానే సెక్స్ బాంబ్ బిపాషా బసు వాడే బూట్లు, శిల్పాశెట్టి ఇచ్చిన బ్యాటరీలు లేకుండా పనిచేసే టార్చ్ లైటు, అలానే రాజస్తాన్ రాయల్స్ ట్వంటీ 20 జట్టు వినియోగించిన ఆటగాళ్ళు సంతకాలు చేసిన బంతి కూడా వేలానికి వస్తాయి.
News Posted: 28 August, 2009
|