స్వైన్ ఫ్లూ కాదు...సర్జరీ
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Mamta2.jpg' align='right' alt=''>దక్షిణాది భాషల్లో నటిగా, గాయనిగా గుర్తింపు తెచ్చుకుంటున్న మలయాళీ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ పేరు ఇటీవల పలు కారణాలతో వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అందర్నీ బెంబేలెత్తిస్తున్న 'స్లైన్ ఫ్లూ' మమతకు సోకిందనీ, దీంతో ఆమె మలయాళ సూపర్ స్టార్ దిలీప్ తో అగ్రిమెంట్ చేసుకున్న సినిమా వదులుకుందనీ ఓ వదంతి. మమత ప్లేస్ లో ఇప్పుడు నటి ఛార్మి చేరిపోయిందనే ప్రచారమూ వచ్చి చేరింది. దీనికి కొంత కలర్ కూడా అద్ది బాలీవుడ్ నుంచి దర్శకుడు ఇంతిహాస్ అలీ ఓ ఆఫర్ ఇవ్వడంతో మమత ఈ మలయాళీ చిత్రానికి గుడ్ బై కొట్టిందంటూ ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేస్తూ వచ్చారు. ఎట్టకేలక మమత పెదవి విప్పి తనపై వస్తున్న వదంతులకు వివరణ ఇచ్చింది.
అస్వస్థత కారణంగానే దిలీప్ తో నటించాల్సిన మలయాళ సినిమా వదులుకున్న మాట నిజమేననీ, అయితే తనకు 'స్వైన్ ఫ్లూ' రావడం అబద్ధమనీ మమత పేర్కొంది. ఛాతీపై గడ్డ ఏర్పడటంతో సర్జరీ చేయించుకున్నాననీ, సెప్టెంబర్ ప్రథమార్థం వరకూ నటనకు దూరంగా ఉంటాననీ చెప్పుకొచ్చింది. మలయాళ సినిమాలో పని చేసేందుకు తాను ఆసక్తితో ఉన్నప్పటికీ ప్రయాణాల వల్ల ఇన్ ఫెక్షన్ కు దారి తీసే అవకాశముందని వైద్యుల హెచ్చరిక మేరకే తాను ఆ సినిమాకు దూరంగా ఉండిపోయాననీ తెలిపింది. బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకే దక్షిణాది సినిమాలకు దూరంగా ఉంటున్నాననే వార్తల్లోనూ నిజం లేదని ఆమె తెలిపారు. సెప్టెంబర్ తర్వాత నాగార్జున సినిమాలో తాను నటించబోతున్నానని వెల్లడించారు. బాలీవుడ్ దర్శకుడు ఇంతిహాజ్ అలీ తనకు బాలీవుడ్ ఆఫర్ ఇస్తారో లేదో తెలియదనీ, తన పోర్ట్ ఫోలియో ఆయనకు ఎలా చేరిందో కూడా తనకు తెలియదనీ మమత చెప్పింది. అయితే వచ్చే ఏడాది బాలీవుడ్ లో అడుగుపెట్టడం మాత్రం ఖాయమని, ఆ వివరాలు ఇప్పుడే తాను చెప్పలేననీ వివరణ ఇచ్చింది. బాలీవుడ్ చెడ్డదేమీ కాదనీ, ప్రతిభ ఉన్న తనలాంటి వారిని మరింత మంది ఆడియెన్స్ చెంత చేర్చేందుకు సరైన ఫ్టాట్ ఫామ్ అనీ కితాబు ఇచ్చింది.
News Posted: 31 August, 2009
|