కంగన కోసం నిరాహార దీక్ష
స్టార్ డమ్ వల్ల అడపాదడపా ఎదురయ్యే చిక్కులేమిటో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌవత్ కు తాజాగా అనుభవంలోకి వచ్చింది. ఇరవై ఏళ్ల ఓ వీరాభిమాని కంగనను చూడాలని, ఆమెతో మాట్లాడాలనీ, ఓ లెటర్ ఇవ్వాలని కాపుకాసి చివరకు నిరాహార దీక్ష కూడా చేపట్టి ఆమె దృష్టిలో పడ్డాడు. ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నాడు. ఇటీవలే ఈ సంఘటన జరిగింది.
ఫిట్ నెస్ కోసం కంగన తరచు ముంబైలోని 'లీనా మోగ్రి' జిమ్ కు వెళ్తుంటుంది. దూరం నుంచే కంగనను గమనిస్తూ ఆమె దృష్టిలో పడాలని ఆ కుర్రాడు తాపత్రయ పడుతుండేవాడు. కంగనా మాటెలా ఉన్నా సెక్యూరిటీ గార్డ్ ల దృష్టిలో మాత్రం పడ్డాడు. అతను జిమ్ సభ్యుడు కాదనీ, అతని వల్ల చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రహించిన గార్డులు ఆ అవరణ వదిలి పెట్టి వెళ్లాలని అతన్ని గట్టిగా హెచ్చరించారు. కంగనా గురించిన వివరాల కోసం అతను ఎంత ప్రాధేయపడినా జిమ్ అధికారులు పెడచెవిన పెట్టి అతన్ని జిమ్ బిల్డింగ్ నుంచి బయటకు పంపించేశారు. దీంతో గేటు బయటే అతను నిరాహార దీక్ష మొదలుపెట్టేశాడు. కంగనతో మాట్లాడి, ఆమెకు ఒక లెటర్ ఇచ్చేంతవరకూ తాను దీక్ష విరమించేది లేదంటూ అక్కడే బైఠాయించాడు. సరిగ్గా మూడు రోజుల తర్వాత కంగన జిమ్ కు వచ్చింది. అప్పుడు కూడా ఆ యువకుడు నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. కంగనను చూడగానే ఎక్కడ లేని ఓపిక తెచ్చుకున్న ఆ యువకుడు చకచకా ఆమె దగ్గరకు వెళ్లి లెటర్ అందజేశారు. ఈసారి కొందరు ట్రైనర్లు కలగజేసుకుని ఆ యువకుడ్ని అక్కడి నుంచి పంపించేశారు. ఈ విషయాన్ని కంగన ధ్రువీకరిస్తూ స్టార్స్ విషయంలో అభిమానులు ఇలా ప్రవర్తించడం సర్వసాధారణమేనని చెప్పుకొచ్చింది. అయితే అభిమాని ఇచ్చిన లెటర్ లో ఏమి రాసి ఉందో చెప్పేందుకు మాత్రం ఆమె నిరాకరించింది.
News Posted: 1 September, 2009
|