క్షమాపణ చెప్పిన స్నేహ చెన్నై: తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలోకి చెప్పులతో ప్రవేశించినట్టు వివాదాన్ని ఎదుర్కొంటున్ననటి స్నేహ సోమవారం సాయంత్రం క్షమాపణ చెప్పుకుంది. జరిగిన దానికి తాను బాధపడుతున్నాననీ, ఇందువల్ల ఎవరి మనోభాలు దెబ్బతిన్నా వారందరికీ పేరుపేరునా క్షమాపణ చెబుతున్నాననీ ఆమె మీడియోకు తెలిపారు.
తన కాలికి గాయమైనందున దూదితో చేసిన పాదరక్షలు ధరించి 'గిరి ప్రదక్షణ' (గిరివాలం)లో పాల్గొన్నానని ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి లిఖిత పూర్వకంగా తన క్షమాపణను హిందూ ముణ్ణనికి పంపించాననీ, దీంతో వివాదం సమసిపోతుందని ఆశిస్తున్నాననీ అన్నారు. అరుణాచలేశ్వరుడుని ఎంతగానో ఆరాధించే స్నేహ ఈనెల 3వ తేదీన తన తండ్రితో కలిసి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పాదరక్షలు ధరించి గిరివాలం కార్యక్రమంలో పాల్గొనరాదు. అందుకు భిన్నంగా స్నేహ పాదరక్షలతో పాల్గొందంటూ నిరసనలు పెల్లుబికాయి. స్నేహ 4 రోజుల లోపు క్షమాపణ చెప్పకుంటే ఆమె ఇంటి ముందు ధర్నా చేస్తామని హిందు ముణ్ణని హెచ్చరించింది. గడువు లోగా ఆమె లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణుగుతుందని ఆశించవచ్చు.
News Posted: 8 September, 2009
|