సింగర్ గా ప్రియాంక చోప్రా! అశుతోష్ గోవారికర్ 'వాట్స్ యువర్ రాశి' చిత్రంలో ఏకంగా 12 పాత్రలు పోషించి ఒకే చిత్రంలో అత్యధిక పాత్రలు పోషించిన నటిగా గిన్సెస్ రికార్డు ను సొంతం చేసుకోనున్న ప్రియాంక చోప్రా ఇప్పడు తనలోని మరో టాలెంటెను బయటకు తీయబోతోంది. గాయనిగా కొత్త అవతారం ఎత్తనుంది. ప్రియాంకకు చక్కటి గాత్రం ఉందనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆమె నటించిన సినిమాల్లో నేపథ్యగానం అందించాల్సిందిగా గతంలో పలువురు దర్శకులు కోరినప్పటి ప్రియాంక మాత్రం నటనకే పరిమితమవుతూ వచ్చింది. ప్రస్తుతం ఆమెలోని గాయనిని ఎలాగైనా బయటకు తేవాలనే పట్టుదలలో సంగీత దర్శకుడు విశాల్ డాడ్లాని ఉన్నారు. ప్రియాంక నటిస్తున్న 'అంజన అంజని' చిత్రానికి విశాల్ సంగీతం అందిస్తున్నారు. యష్ రాజ్ బ్యానర్ లో ప్రియాంక నటిస్తున్న రెండో చిత్రమిది. ఇది రొమాంటిక్ చిత్రం కావడం, రణ్ బీర్ కపూర్ సరనస ప్రియాంక నటిస్తుండటంతో ఎలాగైనే ప్రియాంకను ఒప్పించి పాట పాడించాలని విశాల్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ప్రియాంక దృష్టికి కూడా తీసుకువచ్చారు.
ప్రియాంక చేత పాడించాలనుకుంటున్న విషయాన్ని విశాల్ ధ్రువీకరించారు. 'అంజన అంజని' చిత్రంలో ప్రియాంక పాత్రకు అతికినట్టు ఆమె గాత్రం సరిపోతుందనీ, ఆమెకు మంచి సంగీత పరిజ్ఞానం, చక్కిటి గొంతు ఉందనీ తెలిపారు. ఆమె చేత పాడించాలని తాను చాలాసార్లే ప్రయత్నించాననీ, ఈసారి మాత్రం ఆమె పాడే అవకాశాలున్నాయనీ చెప్పారు. ప్రియాంక సైతం విశాల్ భరద్వాజ్ కంపోజిషన్స్ అంటే చెవికోసుకుంటుంది. అంతా సజావుగా జరిగితే ఈసారి మాత్రం ప్రియాంక ఆ ఛాన్స్ జారవిడుచుకోకపోవచ్చు. ప్రస్తుతం ప్రియాంక ఓ చిన్నపాటి హాలిడే రెస్ట్ మూడ్ లో ఉండటంతో సింగర్ గా మారే విషయాన్ని ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.
News Posted: 8 September, 2009
|