షారూక్ కు తెలివెక్కువ: అమీర్
స్టార్ ఖాన్ లు అమీర్, షారూక్ మధ్య దెప్పిపొడుపుల వార్ చాలాకాలంగా నడుస్తున్నదే. అయితే ఈమధ్యనే మల్టీప్లెక్స్ ల వ్యవహారంపై ఇద్దరూ ఒకే వేదికపైకి వచ్చి నిర్మాతలకు సంఘీభావం తెలపడంతో ఈ ఇద్దరూ కలిసిపోయారనే అభిప్రాయాలకు తావిచ్చింది. అయితే కలవని దిక్కులు కలవవన్నట్టు మళ్లీ కథ మొదటికే వచ్చిందట. ఫ్రాన్స్ లో వెకేషన్ ముగించుకుని ఆదివారం రాత్రి ముంబై తిరిగి వచ్చిన అమీర్ విమానాశ్రయంలో ఓ టీవీ రిపోర్టర్ కంట పడ్డారట. దాంతో ప్రశ్నల పరంపర మొదలైందనీ, అమీర్ పనిలో పనిగా షారూక్ పై విసుర్లు కూడా విసిరారనీ ప్రత్యక్ష సాక్షుల కథనం.
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్స్ లో షారూక్ ను అధికారులు ఇంటరాగేషన్ చేసినట్టే మిమ్మల్ని కూడా విమానాశ్రయాల్లో తనిఖీ చేశారా అని అడిగిన ప్రశ్నకు అలాంటి తనిఖీలు సర్వసాధారణమేనని అమీర్ సమాధానమిచ్చారట. అంతటితో ఆగకుండా 'నేను ఈడియట్ ను కాబట్టి ఎవరూ చెకింగ్ చేయలేదు. షారూక్ సమస్య అల్లా ఆయన తెలివైన వాడు కావడమే' అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారట.అమీర్ తదుపరి చిత్రం '3 ఇడియట్స్ ' కావడంతో బహుశా ఆయన తనను తాను ఈడియట్ గా అభివర్ణించుకుని ఉండవచ్చనీ, అయితే షారూక్ ను తెలివైనవాడు అని సంబోధించడం ద్వారా కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే షారూక్ ఆనాడు వీరంగం సృష్టంచాడనేది అమీర్ అభిప్రాయం కావచ్చనీ ప్రత్యక్ష సాక్షుల కథనం. ఆసక్తికరంగా అమెరికా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో షారూక్ కు ఎదురైన అనుభవాన్ని ఈమధ్యనే సల్మాన్ ఖాన్ కూడా ఇలాగే కొట్టిపారేశారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో రొటీన్ గానే చెకింగ్స్ జరుగుతాయనీ, అదేమంత పెద్ద విషయం కాదనీ సల్మాన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అమీర్ సైతం షారూక్ వ్యవహారంలో సల్మాన్ కు వంతపాడినట్టే కనిపిస్తోంది. మరి షారూక్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి...
News Posted: 15 September, 2009
|