కరీనా సెంట్ వస్తోంది...
సైజ్ జీరో అందాలతో యువత మతులు పోగొడుతున్న కరీనాకపూర్ ఈ మధ్యనే పిజ్జాల రూపంలో అభిమానులను ఊరిస్తోంది. ఢిల్లీలోని ఓ పాపులర్ పిజ్జా చైన్ సెంటర్ 'సైజ్ జీరో' అనే పిజ్జాను ప్రవేశపెట్టి దానికి కరీనా పేర పెట్టడంతో జనాలు లొట్టలేస్తూ లాగించేస్తున్నారు. అభిమానుల్లో తనకున్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని కరీనా ఇప్పుడు తన సొంత పెర్ ఫ్యూమ్ ను మార్కెట్ లోకి తీసుకు వచ్చేందుకు సన్నద్ధమవుతోంది. కరీనా పెర్ ఫ్యూమ్ పేరుతో ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి రానుంది. ఓ ఫారెన్ బ్రాండ్ టైయప్ తో కరీనా ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది. కరీనా ఈ సరికొత్త వెంచర్ పట్ల ఎంతో ఉత్సుకత చూపుతున్నారనీ, స్వయంగా దగ్గరుండి మరీ ఆ వ్యవహారాలు చూసుకుంటున్నారనీ ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నారు.
సెంటు పరిమళం తనను నిరంతరం గుర్తు చేసేలా ఉండాలని కరీనా కోరుకుంటోందనీ, త్వరలోనే ఈ ప్రోడక్ట్ ప్రచారాన్ని కూడా ఆమె చేపట్టనున్నారనీ ఆ వర్గాల సమాచారం. ఈ పెర్ ఫ్యూమ్ కు సంబంధించి ఇప్పటికే ఒక కమర్షియల్ యాడ్ కూడా చిత్రీకరించారట. ఇది మహిళలు ఉపయోగించే పెర్ ఫ్యూమ్ అనీ, ఒకసారి మార్కెట్ లోకి రాగానే పురుషులు తమ పార్టనర్స్ కు మరింత దగ్గరయ్యేందుకు కౌంటర్ల వద్దక్యూలు కట్టడం ఖాయమనీ వారంటున్నారు. కరీనా సెంట్ వచ్చే దీపావళికి మార్కెట్ లోకి రాబోతోంది.
News Posted: 17 September, 2009
|