ఎలేష్ కు రాఖీ గుడ్ బై?!
బాలీవుడ్ ఐటెమ్ గాళ్ రాఖీసావంత్ నచ్చిన మగాడి (మగడు) కోసం 'రాఖీ కా స్వయంవరం' పేరుతో రియాల్టీ షో నిర్వహించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. వివాహ వ్యవస్థపై తనకెంతో నమ్మకం ఉందనీ, పురాణాల్లోనూ స్వయంవరం ద్వారా వరుణ్నివెతుక్కునే సంప్రదాయం ఉందనీ గట్టిగా వాదించింది. వరుడి ఎంపికకాగానే మూడుముళ్లు వేయించుకుంటాననీ నమ్మబలికింది. ఎట్టకేలకు కెనడా యువకుడు ఎలేష్ పరుజున్ వాలాను ఫైనల్స్ లో ఎంపిక చేసినప్పటికీ నిశ్చితార్ధంతోనే సరిపెట్టేసింది. ఎలేష్ తన సొంత కాళ్ల మీద తాను నిలబడేంత వరకూ వేచిచూస్తాననీ, అప్పుడే తమ పెళ్లనీ ఇంతకాలం చెప్పుకొంటూ వచ్చిన రాఖీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించేసిందంటూ బాలీవుడ్ వర్గాల్లో తాజాగా గట్టి ప్రచారం జరుగుతోంది.
రాఖీ స్యయంవరం 'డ్రామా' ముగిసినట్టేననీ, ఎలేష్ కు గుడ్ బై చెప్పనుందనీ అభిజ్ఞ వర్గాల కథనం. ఎలేష్ ను వివాహం చేసుకోవడానికి సహేతుకమైన కారణం ఏదీ రాఖీకి కనబడటం లేదట. ఇక్కడి కెరీర్ ను వదులుకుని ఎలేష్ తో కెనడా వెళ్లడానికి, అక్కడ ఒక బిడ్డకు తల్లి కావడానికి ఆమె సుతరాము ఇష్టపడటం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. 'పతి పత్నీ ఔర్ వో' రియాల్టీ షో లో ఇద్దరూ కలిసి పాల్గొంటున్న తరుణంలోని వారి మధ్య మనస్ఫర్ధలు తలెత్తాయట. 'రియాల్టీ షో సందర్భంలోనే ఇద్దరి మధ్యా ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి' అని రాఖీని ఉటంకిస్తూ మీడియా వార్తలు కూడా వెలువడ్డాయి. 'స్వయంవరం' రియాల్టీకి తెరపడినప్పుడే రాఖీ తనదైన శైలిలో కొత్త డ్రామా మొదలుపెడుతుందని అనుకున్న వాళ్లకు కొదవలేదు. ఎలేష్ ను పెళ్లాడుతుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూసిన వాళ్లూ ఉన్నారు. పలువురు ఊహించినట్టే ఆమె నిశ్చితార్ధం వద్దే ఆగిపోయింది. మూడుముళ్ల తుది ఘట్టం ఎప్పుడనేది ఇప్పుడు భవిష్యత్ కు చెందిన ప్రశ్నగానే ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఎలేష్ తన లగేజ్ సర్దుకుని కెనడా బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్నాడనీ, ఎన్టీటీవీ ఇమాజిన్ కు ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ రియాల్టీ షో మళ్లీ ప్రారంభమైనప్పుడే తిరిగి వస్తాడనీ కొన్ని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. 'స్వయంవరం' చివరి ఎపిసోడ్ లో ఎలేష్ ను పెళ్లాడుతున్నట్టు ప్రకటించిన రాఖీ ఇప్పుడు 'పత్రి పత్ని ఔర్ వో' ఫైనల్ ఎపిసోడ్ లో ఎలేష్ తో తెగతెంపుల సంగతి బయట పెడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. మరి రాఖీ తన మనోగతం బయట పెడుతుందా, ఎలేష్ ను తనకు కాకుండా చేసేందుకు మీడియా తనపై విషం చిమ్ముతున్నారంటూ విరుచుకుపడుతుందా అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.
News Posted: 21 September, 2009
|