టోరంటోలో శ్రియానందం!
దిలీప్ మెహతా 'కుకింక్ విత్ స్టెల్లా' చిత్రంలో నటించిన అందాల నటి శ్రియ టోరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ లో జరిగిన ఆ చిత్రం ప్రీమియర్ కు హాజరుకావడం ఒక వినూత్న మైన అనుభూతిని కలిగించిందని సంబరం వ్యక్తం చేస్తోంది. భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే చీరకట్టుతో ఫెస్టివల్ లో పాల్గొన్న శ్రియకు రెడ్ కార్పెట్ ఆహ్వానం లభించింది. 'దీపా మెహతా, దిలీప్ ఫ్యామిలీలో నేను కూడా ఒక సభ్యురాలిని, వారిద్దరికీ నేనంటే ఎంతో ఇష్టం. దీప నన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ప్రతిసారి సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది' అని టోరంటో నుంచి శ్రియ తన స్పందన తెలియజేసింది.
టోరంటో ఫెస్టివల్ కు చీరకట్టుతో హాజరుకావడంపై శ్రియ మాట్లాడుతూ, తాను భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున చీర ధరించడమే సరైనదని తాను భావించాననీ, మనీష్ మల్హోత్రా డిజైన చేసిన ఈ దుస్తులు తనకెంతో కంఫర్ట్ గా ఉన్నాయనీ చెప్పుకొచ్చారు. శ్రియ తన తల్లితో కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు. టోరంటో రావడం, తొలిసారి ఇక్కడి ఫెస్టివల్ లో పాల్గొనడంతో తానెంతో ఉద్వేగానికి లోనయ్యానని అన్నారు. శ్రియ ఈ చిత్రానికి ముందే 'ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్' అనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ లో నటించారు. అయితే ఆ చిత్రం ప్రేక్షకాదరణ చూరగొనలేదు. ఆ విషయాన్ని శ్రియ అంగీకరిస్తూనే, ఆ చిత్రం కోసం తామెంతో కష్టపడ్డామనీ, నిజానికి సినిమా చేయడానికి ముందే వర్క్ షాప్ లో పాల్గొన్నామనీ అన్నారు. ప్రస్తుతం తాను తమిళంలో ధనుష్ కథానాయకుడుగా 'కుట్టీ' అనే భారీ చిత్రంలో నటిస్తున్నాననీ, అది దీపావళి కానుకగా విడుదలవుతుందనీ తెలిపారు. టోరంటో ఫెస్టివల్ తర్వాత న్యూయార్క్ లో జరిగే సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ ఫెస్టవిల్ కు హాజరుకానున్నట్టు చెప్పారు.
News Posted: 21 September, 2009
|