'రాశి' మాస్టర్ ప్రింట్ మాయం
ముంబై: 'లగాన్', 'స్వదేశ్', 'జోథా అక్బర్' వంటి సంచలన చిత్రాలను అందించిన అశుతోష్ గోవారికర్ తాజాగా ప్రియాంక చోప్రా, హర్మన్ బవేజా జంటగా ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన 'వాట్స్ యువర్ రాశి' చిత్రం భారీ అంచనాల మధ్య ఈనెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఈ చిత్రం మాస్టర్ ప్రింట్స్ మాయమైంది. ఈ వ్యవహారంలో యాడ్స్ ల్యాబ్స్ ప్రోసెసింగ్ విభాగానికి చెందిన బిజినెస్ డవలప్ మెంట్ మేనేజర్ దుర్గాదాస్ భక్తాను పోలీసులు అరెస్టు చేశారు.
కోట్లాది రూపాలయ వ్యయంతో 'వాట్స్ యువర్ రాశి' చిత్రాన్ని అశుతోష్ నిర్మించగా, కేవలం 2 లక్షల రూపాయల కోసం మాస్టర్ ప్రింట్ ను దుర్గాదాస్ బయటకు పంపించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయముందని భావిస్తున్న అజయ్ ఉదయన్ సింగ్ పాల్, అఫ్సర్ అలియాస్ హైదర్ హుస్సేన్, ఫిరోజ్ అలియాస్ సమీర్ ఇర్ఫాన్ ఖాన్, అమన్ అలియాస్ తాంజీమ్ అలి హమీద్ అలి అనే వ్యక్తులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఈ పైరసీ రాకెట్ తో ప్రమేయమున్న ఐదుగురిని అరెస్టు చేశామనీ, తదుపరి విచారణ జరుపుతున్నామనీ ఎన్ ఫోర్స్ మెంట్ పోలీసు డిప్యూటీ కమిషనర్ సెయిలా సైల్ తెలిపారు. యాడ్ ల్యాబ్స్ కు మాస్టర్ ప్రింట్ ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత ఆ ప్రింట్ మాయమైనట్టు గుర్తించారనీ, గోవాకరర్ కు ఆ విషయం తెలియగానే పోలీసు కంప్లయింట్ ఇచ్చారనీ, ముంబై క్రైం బ్రాంచ్ ఈ కేసు చేపట్టిందనీ పోలీసు వర్గాలు తెలిపాయి. శనివారంనాడు కొందరు వ్యక్తులు మాస్టర్ ప్రింట్ తో ఖేర్వాడి జంక్షన్ వద్దకు వచ్చినట్టు తమకు సమాచారం అందిందనీ, అఫ్సర్, ఫిరోజ్, అమాన్ అనే వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామనీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిల్మ్ సిటీ నుంచి తమకు ప్రింటు అందినట్టు ఆ ముగ్గురూ ఇంటరాగేషన్ లో వెల్లడించినట్టు ఆయన చెప్పారు.దుర్గాదాస్ కూ, అతని అసోసియేట్ అజయ్ కు తాము 2 లక్షల రూపాయలు చెల్లించామనీ, పైరసీ సిడీలు, డివిడిలు తయారు చేసి దేశవిదేశాల్లో అమ్మకాలు జరపాలని తాము ప్లాన్ చేసినట్టు కూడా ఒప్పుకున్నారనీ ఆయన తెలిపారు. సదరు గ్యాంగ్ నుంచి పలు పైరేటెడ్ సిడీలు, డీవిడిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఐదుగురిని స్థానిక కోర్టు ముందు హాజరు పరచగా, ఈనెల 30 వరకూ వారిని పోలీసు రిమాండ్ కు కోర్టు ఆదేశించింది.
News Posted: 22 September, 2009
|