షారూక్ ను మెచ్చిన సల్మాన్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/salman-sharukh.jpg' align='right' alt=''>ఇద్దరూ ఖాన్ హీరోలే అయినప్పటికీ వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నిజానికి ఇది వృత్తిపరమైన వైరం కాదు. వ్యక్తిగత వైరం. అది కూడా ఓ ఏడాది క్రితమే ఈ వైరం తలెత్తింది. ఆ ఇద్దరూ షారూక్, సల్మాన్ అనేది ఈజీగానే చెప్పేయొచ్చు. గత ఏడాది కత్రినా బర్త్ డే పార్టీలో షారూక్ వేసిన ఓ ఇబ్బందికరమైన జోక్ సల్మాన్ కు కడుపు మండి ఆయనతో గొడవ పడ్డాడు. నిన్నకాన మొన్న షారూక్ తనకు అమెరికా ఎయిర్ పోర్ట్ లో తనిఖీల పేరిట అవమానించారంటూ వాపోయినప్పడు కూడా...తనిఖీ రొటీన్ వ్యవహారమేనంటూ షారూక్ వ్యవహారం ఓ పబ్లిసిటీ స్టంట్ అనే తరహాలో సల్మాన్ కొట్టిపారేశారు. అనూహ్యంగా ఇప్పుడు షారూక్ పై సల్మాన్ ప్రశంసల జల్లు కురిపించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. షారూక్ మంచి ప్రొఫెషనలిజం ఉన్న నటుడనీ, రొమాంటిక్ పాత్రల్లో నట విశ్వరూపం చూపించడంలో ఆయనకు ఆయనే సాటి అనీ ప్రశంసలు కురిపించారు. 'దస్ కా దమ్' రియాల్టీ షో (ఈ ఎపిసోడ్ ఇంకా ప్రసారం కావలసి ఉంది) లో ఈ సంఘటన చోటుచేసుకుంది. రితీష్ దేశ్ ముఖ్, గోవింద ఈ ఎపిసోడ్ లో పాల్గొన్నారు.
ధ్వన్యనుకరణలో దిట్ట అయిన రితీష్ ను ఎవరైనా నటుడిని అనుకరించమని సల్మాన్ కోరినప్పుడు షారూక్ వాయిస్ ను ఆయన అనుకరించారట. అనంతరం సల్మాన్ స్పందిస్తూ 'రొమాంటిక్ సన్నివేశాలు వచ్చినప్పుడు షారూక్ అసమాన ప్రతిభ చాటుకుంటారు. షారూక్ కంటే బాగా చేయడం ఎవరి వల్లా కాదు. ఆయన కళ్లలో అలాంటి రొమాంటిక్ ఇంటెన్సిటీ ఉంది' అని వ్యాఖ్యానించారట. రితీష్ ఫేవరెట్ సీన్ షారూక్ నటించిన 'దిల్ హై తో పాగల్ హై' చిత్రంలోనిదనీ, ఆ విషయం సల్మాన్ కు తెలిసినప్పటికీ ఆయన కంఠాన్ని అనుసకరించమని కోరారనీ ఆ షో కోసం పనిచేసిన యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని 'దస్ కా దమ్' నిర్మాత అనితా బసు ధ్రువీకరిస్తూ, సల్మాన్ మంచి ప్రొఫెషనల్ అనీ, షారూక్ పై చేసిన వ్యాఖ్యలు ఎంతో హుందాగా ఉన్నాయనీ అన్నారు. అయితే షారూక్ ఫ్రొఫెషనలిజం గురించి ప్రశంసలు కురిపించినంత మాత్రాన ఆ ఇద్దరూ (సల్మాన్-షారూక్) మంచి మిత్రులని అనుకోవడానికి వీల్లేదని మరికొందరి వాదన. తాజా పరిణామం తర్వాత మళ్లీ సల్మాన్-షారూక్ ల మధ్య మునుపటిలా సయోధ్య కుదురుతుందా అనేది చూడాలి.
News Posted: 26 September, 2009
|