గుల్ పనాగ్ కు కుక్కకాటు
బాలీవుడ్ బ్యూటీ గుల్ పనాగ్ కొద్దిరోజులుగా తీవ్రమైన పెయిన్ తో విలవిల్లాడుతోంది. గుల్ పనాగ్ ఎంతో మురిపెంగా పెంచుకుంటున్న మిలో అనే శునకరాజం ఆమెను కరవడమే ఇందుకు కారణం. దీనికి విరుగుడుగా గుల్ పనాగ్ ప్రస్తుతం యాంటీ-రేబిస్ ఇంజక్షన్లు తీసుకుంటోంది. మొదట్లో కుక్క కరవగానే పెయిన్ ను దృష్టిలో పెట్టుకుని మెడిసన్ అప్లయ్ చేసిందట. అయితే గాయం నొప్పి మరింత పెరగడంతో వైద్యులను సంప్రదించక తప్పలేదు.
'మిలో పెంపుడు కుక్క కావడం వల్ల 3 యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. టెట్నస్ ఇంజెక్షన్ కూడా తీసుకున్నాను' అని గుల్ తెలిపింది. పెంపుడు కుక్క కరవడం తనకు ఇది మొదటిసారి కూడా కాదనీ, గతంలో కూడా ఇలాంటి అనుభవాలే తనకెదురయ్యాయనీ ఆమె చెప్పింది. సోఫా కింద నుంచి బయటకు తీయాలనుకున్నప్పుడు, స్నానానికి తీసుకు వెళ్లాలని ప్రయత్నించినప్పుడు మిలో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని చెప్పుకొచ్చింది. యానిమల్ లవర్ అయిన గుల్ పనాగ్ ముందుగా నిర్ణయించిన ప్రకారం మిలోను తీసుకుని డాగ్ షో పాల్గొనవలసి ఉంది. అయితే మిలో కాటుతో ఆ కార్యక్రమాన్ని గుల్ పనాగ్ రద్దు చేసుకుంది.
News Posted: 29 September, 2009
|