సల్మాన్ తో 'నో-ఎంట్రీ' సీక్వెల్
తెలుగు రీమేక్ లతో బాలీవుడ్ స్టార్ హీరోలు సంచలనాలు సృష్టిస్తున్నారు. 'గజనీ' రీమేక్ అమీర్ కు సూపర్ సక్సెస్ ను అందించగా, ఇటీవల కాలంలో సరైన సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న సల్మాన్ కు ఇప్పడు 'వాంటెడ్' చిత్రం సరైన బ్రేక్ ఇచ్చింది. ప్రిన్స్ మహేష్ 'పోకిరి' చిత్రానికి రీమేక్ గా 'వాంటెడ్' చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వంలో బోనీకపూర్ హీందీలో నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా హిట్ టాక్ తెచ్చుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ తరుణంలో సల్మాన్ తోనే మళ్లీ చేతులు కలిపి 'నో ఎంట్రీ' సీక్వెల్ తీసేందుకు బోనీకపూర్ ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్-అనిల్ కపూర్ -ఫర్దీన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో 2005లో 'నో ఎంట్రీ' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
'నోఎంట్రీ' సీక్వెల్ లో ప్రధాన హీరోలు ముగ్గురూ ఉండబోతున్నారు. ఆసక్తికరంగా ఆ ముగ్గురూ ద్వితాత్రాభినయం చేయబోతున్నారు. తొలి వెర్షన్ లో హీరోయిన్లుగా నటించిన లారాదత్తా, సెలీనా జైట్లీ, ఇషా డియోల్ సైతం సీక్వెల్ లో ఉండబోతున్నారు. ఈ ముగ్గురు హీరోయిన్లతో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు ఇందులో ఉంటారు. ఈ చిత్రానికి 'నో ఎంట్రీ - బి పాజిటివ్' అనే టైటిల్ కూడా అనుకుంటున్నారు. అనీష్ బజ్మీ దర్శకత్వంలో ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది.
News Posted: 29 September, 2009
|