మన్నాడేకి ఫాల్కె అవార్డు
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/manna_dey.jpg' align='right' alt=''>న్యూఢిల్లీ: ప్రఖ్యాత సినీ నేపథ్యగాయకుడు మన్నా డేకి 2007 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. సినీరంగంలో విశిష్ట సేవలందించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారమిది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ మన్నాడే పేరును ఖరారు చేసినట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా అక్టోబర్ 21న ఈ అవార్డును మన్నాడే అందుకుంటారు.
మన్నాడే అసలు పేరు ప్రబోధ్ చంద్ర డే. ఆ తర్వాత మన్నాడే గా ఆయన పాపులర్ అయ్యారు. 1919 మే 1న కోల్ కతాలో జన్మించిన మన్నాడే 1942లో కృష్ణ చంద్రడే, సచిన్ దేవ్ బర్మన్ వద్ద సహాయకుడుగా పనిచేశారు. ఆ తర్వాత క్రమంలో సొంతంగా ఆయన పలు చిత్రాలకు సంగీతం అదించారు. 1943లో 'తమన్నా' చిత్రానికి తొలిసారి నేపథ్యగానం అందించారు. 'షోలే' చిత్రంలోని 'యే దోసతీ', 'పడోసన్'లోని 'ఏక్ చతుర్ నార్' వంటి పాటలతో ఆయన అభిమానుల గుండెల్లో నిలిచిపోయారు. 'సూరైయ' చిత్రంలో ఆయన పాడిన పాట ఇన్ స్టంట్ హిట్ అయింది. మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్, ముఖేష్ వంటి ప్రముఖ గాయకులతో కలిసి పనిచేశారు. 1950-70 దశకాల్లో సింగర్ గా, కంపోజర్ గా ఆయన పేరు మారుమోగిపోయింది. హిందీ, బెంగాలీ చిత్రాల్లో 3.500కు పైగా పాటలు పాడారు. పలుమార్లు ఉత్తమ గాయకుడుగా జాతీయ అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. 1971లో పద్మశ్రీ, 2005లో పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఇప్పుడు ఆయన కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే వచ్చి చేరింది.
News Posted: 30 September, 2009
|