పిరమిడ్ తో నష్టపోయా: కమల్
పద్మశ్రీ కమల్ హాసన్ పై పిరమిడ్ సాయిమిరా సంస్థ వేసిన కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. 'మర్మయోగి' చిత్రం కోసం పారితోషికం తీసుకుని ఆ సినిమా తర్వాతే మరో సినిమా చేస్తానని చెప్పిన కమల్ మాటతప్పి సొంతంగా సినిమా తీసుకున్నారంటూ పిరమిడ్ సాయిమిరా ఇటీవల కమల్ పై కేసు వేసింది. ఇందుకు ప్రతిగా కమల్ తనకే పిరమిడ్ సాయిమిరా సంస్థ నష్టపరిహారంగా 11 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కేసు వేశారు. దీంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
'మర్మయోగి' సినిమా ఒప్పుకున్నప్పుడు పిరమిడ్ సాయిమిరా ఆర్థిక పరిస్థితి ఏమిటనేది తనకు తెలియదనీ, అయితే ఆ సంస్థ తనకు ఇచ్చిన 1.5 కోట్ల రూపాయల చెక్కు బౌన్స్ కావడంతో ఆ ప్రాజెక్ట్ చిక్కుల్లో పడిన విషయాన్ని తాను గ్రహించాననీ కమల్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తనకు రమేష్ షిప్పీ నిర్మాణ సంస్థ నుంచి, వాల్ట్ డిస్నీ సంస్థ నుంచి ఆఫర్లు వచ్చాయనీ, అయితే 'మర్మయోగి' చిత్రానికి కమిట్ అయినందున ఆ ఆఫర్లను నిరాకరించారనీ కమల్ తెలిపారు. రమేష్ షిప్పీ సంస్థ 10 కోట్లు ఆఫర్ చేసిందనీ, వాల్ట్ డిస్నీ 10 కోట్లు ఆఫర్ ఇచ్చి ఆ తర్వాత 20 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడిందనీ అన్నారు. అలాంటి మంచి ఆఫర్లు వచ్చినప్పటికీ పిరమిడ్ సాయిమిరా వల్లనే తాను ఆ ఆఫర్లను ఒప్పుకోలేదని అన్నారు. తనకు జరిగిన డ్యామేజ్ కు పరిహారంగా 10 శాతం వడ్డీతో 11 కోట్ల రూపాయలను పిరమిడ్ సంస్థ చెల్లించాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈనెల 9న ఈ కేసు విచారణకు రానుంది.
News Posted: 3 October, 2009
|