చెన్నై: తమిళ నటి భువనేశ్వరి వ్యభిచార నేరం కింద అరెస్టు కావడం, అనంతరం పరిణామాలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. వ్యభిచారం నడుపుతున్న వారిలో పలువురు నటీమణులు కూడా ఉన్నారంటూ భువనేశ్వరి పోలీసులకు ఇచ్చినట్టు చెబుతున్న వాంగ్మూలాన్ని రెండ్రోజుల క్రితం ఓ వార్తా కథనంగా 'దినమలర్' పత్రిక ప్రచురించింది. ఈ వార్తా కథనం కొందరు నటీమణుల మనోభావాలను గాయపరిచిందంటూ దక్షిణ భారత సినీ ఆర్టిస్టుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 'దినమలర్' పత్రిక న్యూస్ ఎడిటర్ లెనిన్ ను పోలీసులు బుధవారం సాయంత్రం పత్రికా కార్యాలయంలో అరెస్టు చేశారు. మహిళల వేధింపు చట్టం కింద పోలీసులు ఈ అరెస్టు చేశారు.
లెనిన్ ను అరెస్టు చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచి ఈనెల 21 వరకూ రిమాండ్ కు పంపారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరమే లెనిన్ పై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు. చెన్నైలో జరుగుతున్న 'ఫ్లెష్ ట్రేడ్'లో ప్రమేయమున్న కొందరు తమిళ తారల పేర్లతో ఈనెల 4న ఒక వార్తను 'దినమలర్' ప్రచురించింది. వ్యభిచారం నడుపుతున్న నేరం కింద నాలుగు రోజుల క్రితమే అరెస్టయిన నటి భువనేశ్వరి తన వాంగ్మూలంలో ఈ పేర్లను వెల్లడించిందని పేర్కొంటూ ఆ వార్తా కథనం సాగింది. అయితే ఈ వార్త ప్రచురించిందుకు మరుసటి రోజే పత్రిక విచారం(రెగ్రెట్ నోట్) వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఫిల్మ్ ఆర్టిస్టుల సంఘం ప్రతినిధులు పోలీసు కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. మరోవైపు లెనిన్ అరెస్టును మద్రాసు జర్నలిస్టుల యూనియన్ (ఎంయుజె) తీవ్రంగా ఖండించింది. వార్తా కథనానికి లెనిన్ బాధ్యుడని పోలీసులు స్థిరనిశ్చయానికి రావడం ఆశ్చర్యం కలిగిస్తోందని యూనియన్ జనరల్ సెక్రటరీ డి.సురేష్ కుమార్ తప్పుపట్టారు.