నత్తి హీరో హృతిక్
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Hrithik9.jpg' align='right' alt=''>ఆయన బాలీవుడ్ సూపర్ స్టార్. చక్కటి డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. అయితే ఆయన చిన్నతనంలో నత్తిగా మాట్లాడేవారట. ఎక్కడ తన లోపం పక్కవాళ్లకు తెలిసి తనను చిన్నబుచ్చుతారోనని బెంబేలెత్తిపోయేవారట. ఆయనే సూపర్ హీరో హృతిక్ రోషన్ అంటే ఇప్పుడు నమ్మబుద్ధి కాదు. కానీ అది నిజం. ఆరేళ్ల వయసుల్లో ఈ లోపాన్ని ఆయన కనిపెట్టారట. ఫరాఖాన్ సెలబ్రెటీ చాట్ షో 'తేరే మేరే బీచ్ మే'లో పాల్గొన్న హృతిక్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పుకొచ్చారు. ఈ శనివారమే 'స్టార్ ప్లస్'లో ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.
'ఎవరికైనా సరే మాటలు రాకముందు వరకూ అంతా సజావుగా ఉంటుంది. మాటలు రావడం మొదలైన తర్వాత సక్రమంగా మాటలు రాకపోతే ఆ పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది. జనం ఎందుకు మన వైపే చూస్తున్నారనేది కూడా అర్ధం కాని పరిస్థితి. నిజంగా ఇది నరకమే' అని హృతిక్ తెలిపారు. తన స్కూలు రోజుల్ని నెమరువేసుకుంటూ, నత్తిగా మాట్లాడటం చూసి సాటి పిల్లలు ఏడిపించేవారనీ, పరీక్షలకు హాజరు కావడం తనకు ఓ అగ్నిపరీక్షలా ఉండేదనీ వివరించారు. స్కూలులో మౌఖిక పరీక్షలు (ఓరల్ టెస్ట్) ఉన్నప్పుడు ఒంట్లో బాగాలేదని చెప్పడం, చేతికి దెబ్బలు తగుల్చుకుని ఆ సాకుతో స్కూలు ఎగ్గొట్టేవాడననీ చెప్పారు. నిజానికి పిల్లలు చాలా అమాయకులనీ, వారికి ఉన్న అవకరాన్ని ఎత్తిచూపరాదనీ అన్నారు. అయితే బాల్యంలోనే ఇలాంటి సమస్య వస్తే అది నరకప్రాయంగానే ఉంటుందన్నారు. మరి ఈ సమస్య హృతిక్ ను ఎన్నేళ్ల వరకూ బాధించి ఉండొచ్చు? '6 నుంచి 35 వరకూ..' అని హృతిక్ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఆయన ఇప్పుడు 35వ పడిలోకే అడుగుపెట్టారు.
News Posted: 10 October, 2009
|