'మోస్ట్ వాంటెడ్' తార
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/Nayanthara_prabhu.jpg' align='right' alt=''>బాలీవుడ్ తారలంతా దక్షిణాది భాషా చిత్రాలకూ, ముఖ్యంగా టాలీవుడ్ కు క్యూలు కడుతుండే, దక్షిణాది తారలు బాలీవుడ్ బాట పడుతున్నారు. ఆసిన్ ఈ మధ్యనే 'గజనీ'తో హిందీ పరిశ్రమలోకి అడుగుపెడితే, త్రిష సైతం ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందనున్న 'కట్టామీటా' చిత్రంలో అక్షయ్ కుమార్ కు జోడిగా హిందీలోకి అడుగుపెడుతోంది. దక్షిణాదిన డిమాండ్ ఉన్న శ్రియ, జెనీలియా వంటి తారలు
ఇప్పటికే హిందీలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు సంచలన తార నయనతార వంతు వచ్చింది. చాపకింద నీరులా నయనతారను బాలీవుడ్ లో ల్యాండ్ చేసేందుకు ప్రభుదేవా చేసిన ప్రయత్నాలు ఫలించాయనీ, నయనతార కోరిక తీరే సమయం రానే వచ్చిందనీ ముంబై ఫిలిం సర్కిల్స్ లో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
'పోకిరి' హిందీ రీమేక్ గా సల్మాన్ తో ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన 'వాంటెడ్' చిత్రం సంచలన విజయం సాధించింది. దీనికి సీక్వెల్ గా 'మోస్ట్ వాంటెడ్' చిత్రాన్ని మళ్లీ ప్రభుదేవా దర్శకత్వంలోనే నిర్మాత బోనీకపూర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ గా నయనతార పేరును ప్రభుదేవా సూచించారనీ, దక్షిణాదిలో ఆమెకున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని బోనీ కూడా సుముఖంగానే ఉన్నారనీ తెలుస్తోంది. నయనతార, ప్రభుదేవా మధ్య ప్రేమాయణం కొనసాగుతోందంటూ, సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారనీ కొద్దికాలంగా దుమారం రేగుతున్న తరుణంలో నయనతారకు ఆయన బాలీవుడ్ ఆఫర్ ఇప్పించినట్టు వస్తున్న వార్తలు మళ్లీ అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాయి. తన ప్రియుడు ప్రభుదేవాతో కలిసి ఇటీవలే 'వాంటెడ్' స్క్రీనింగ్ కోసం నయనతార ముంబై వెళ్లడం కలకలం సృష్టించింది. దీనిపై ప్రభుదేవా భార్య కూడా మండిపడుతూ నయనతార కనిపిస్తే ఎడాపెడా వాయిస్తానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నయనతార వ్యవహారంలో ప్రభుదేవాకు కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా సినీ ప్రముఖులను ఆమె కోరింది. ఈ నేపథ్యంలో 'మోస్ట్ వాంటెడ్' ఆఫర్ ను నయనతార అంగీకరించి కొత్త చిక్కులను తలకెత్తుకుంటుందా అనేది ఫిల్మ్ సర్కిల్స్ లో ఉత్సుకతను రేపుతోంది.
News Posted: 21 October, 2009
|