ట్రైబల్ టెర్రరిస్టుగా జయప్రద
ఇద్దరూ రాజకీయ దిగ్గజాలే. సమాజ్ వాది పార్టీ నేతలే. ఒకరు అమర్ సింగ్, మరొకరు ప్రముఖ నటి జయప్రద. రాజకీయ వేత్తలుగా పాపులర్ అయిన ఈ ఇద్దరూ ఇప్పుడు అణచివేతకు గురవుతున్న అటవీ గిరిజనులకు బాసటగా పోరాటం చేయబోతున్నారు. ఇదంతా రియల్ లైఫ్ లో కాకుండా రీల్ లైఫ్ కు చెందిన ముచ్చట కావడమే విశేషం. జాతీయ అవార్డు గ్రహీత, బెంగాలీ దర్శకుడు అశోక్ విశ్వనాథ్ 'శేష్ సంగత్' చిత్రం కోసమే అమర్, జయప్రద ఈ కొత్త అవాతారంలో కనిపించనున్నారు. పశ్చిమ బెంగాల్ లో మావోయిస్టులకూ, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుండటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
జయప్రద ఈ చిత్రాన్ని నిర్మిస్తూ రాజి అనే గిరిజన యువతి పాత్రను పోషిస్తున్నారు. ఇందులో తీవ్ర అవమానాలకు, వేధింపులకు గురైన రాజీ తీవ్రవాద గ్రూపులో చేరుతుంది. 'పేద ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రతి చోట అణచివేతకు గురవుతున్నారు. వారికి న్యాయం అందని ద్రాక్షే అవుతోంది. నేను ప్రాతినిథ్యం వహిస్తున్న రాంపూర్ నియోజకవర్గంలో ఈ పరిస్థితిని నేను స్వయంగా చూశాను. అలాంటి బర్నింగ్ ప్లాబ్లంతోనే ఈ చిత్రం రూపొందుతోంది' అని జయప్రద తెలిపారు. అణచివేతకు గురవుతున్న ప్రజల పట్ల సానుభూతి చూపించే రాజకీయవేత్త పాత్రను అమర్ సింగ్ పోషిస్తున్నారు. ఉన్నవాళ్లు-లేనివాళ్లు, భూకజ్బాదారులు, భూముల్లేని గిరిజనుల మధ్య జరుగుతున్న పోరాటాన్ని ప్రతిబింబించే చిత్రమిదని అమర్ సింగ్ తెలిపారు. ఈ చిత్రంలో బెంగాల్-జార్ఘాండ్ సరిహద్దుకు వృత్తిరీత్యా వెళ్లే పోలీస్ ఆఫీసర్ పాత్రను జాకీ షరాఫ్ పోషిస్తున్నారు. ఇటీవల జరుగుతున్న తీవ్రవాద సంఘటనల నుంచి లబ్ది పొందేందుకే ఈ చిత్రం తీస్తున్నారనే వాదనను విశ్వనాథన్ తోసిపుచ్చారు. 2007లోనే తాను ఈ కథను రాసుకున్నారనీ, అయితే స్క్రిప్టు సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుందనీ అన్నారు. 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదలకు సిద్ధం చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో ని సుమారు 50 థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. మెట్రో సిటీస్ లోనూ హిందీ సబ్ టైటిల్స్ తో డిసెంబర్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు జయప్రద తెలిపారు.
News Posted: 26 October, 2009
|