'రెడ్ హాట్' నీతూ
ఎప్పుడూ సంచలన వార్తల్లో ఉండటం బాలీవుడ్ హాట్ గాళ్ నీతూచంద్ర స్పెషల్. ఆమధ్య మేగ్జిమ్ కవర్ పై మెరుపులు సృష్టించిన నీతూ ఈమధ్యనే 'ది మ్యాన్' పత్రిక కోసం 'లెస్బియన్' తరహా ఫోజులివ్వడం వివాదం రేపింది. 'సత్యమేయ జయతే' షూటింగ్ లో ఆ చిత్ర కథానాయకుడు తనను వేధింపులకు గురిచేశాడంటూ ముంబైలో ప్రెస్ మీట్ పెట్టి మరీ యాగీ చేయడం కూడా సంచలనమైంది. ఇన్ని సంచలనాల మధ్య ఇప్పుడు ఓ తమిళ చిత్రం కోసం రియల్ ప్రొఫెషనిలిజం చూపించి అందరి దృష్టినీ మరోసారి ఆకట్టుకోనుంది. అసలే హాట్ గాళ్ అనిపించుకున్న నీతూ ఇప్పుడు నిజంగానే 'తీర్థ విలయాట్టు పిల్లై' చిత్రం కోసం రెడ్ చిల్లీస్ (ఎండు మిరప) టబ్ లో అందాలు ఆరబోస్తూ ప్రేక్షకులకు మరింత హీట్ పెంచబోతోంది. విశాల్ హీరోగా తిరు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ఇటీవలే ఈ సన్నివేశాలు చిత్రీకరించారు.
ఈ చిత్రంలోని 'రెడ్ హాట్' సన్నివేశం గురించి నీతూ వివరిస్తూ 'సినిమాలోని ఇంట్రో సాంగ్ గా ఇది వస్తుంది. ముంబైలోని ఓ స్టూడియోలో చిత్రీకరణ జరిగింది. ఇది సినిమాలో హైలైట్ సాంగ్ అవుతుందనీ, ప్రమోస్ లో కూడా వాడతామనీ దర్శకుడు తిరు చెప్పారు. ఈ సన్నివేశం కోసం బాత్ టబ్ లో డమ్మీ రెడ్ చిల్లీస్ ఉపయోగిస్తామని చెప్పారు. తీరా తెప్పించిన డమ్మీ రెడ్ చిల్లీస్ తో టబ్ నిండలేదు. దాంతో నిజమైన మిర్చి నింపుదామని తిరు చెప్పడంతో షాక్ తిన్నా. ఆ వెంటనే తేరుకుని ప్రొఫెషనలిజం చూపిస్తూ టబ్ లోకి చేరిపోయా' అంటూ నవ్వుతూ చెప్పింది. అయితే అసలు కష్టాలు అప్పుడే మొదలయ్యాయట. టబ్ లోకి చేరగానే ఎండు మిరకాయల ప్రభావం మొదలైందనీ, విశాల్ ను రెచ్చగొట్టే విధంగా తాను హావభావాలు ఇస్తూ దర్శకుడు కట్ చెప్పగానే మిరప ఘాటు వల్ల ఒక్కసారిగా కంటివెంట నీళ్లు ధారాపాతంగా వర్షించాయనీ చెప్పుకొచ్చింది. సన్నివేశం చిత్రీకరణ పూర్తయిన వెంటనే మరో టబ్ లోకి (చిల్లీలు లేని టబ్) చేరి రెండుగంటల సేపు సేదతీరాననీ, అయితే ఒంటిమీద ఏర్పడిన పొక్కులు, దురదలు వదిలించుకోవడానికి మాత్రం ఓ రోజంతా పట్టిందనీ తెలిపింది. ఈ అనుభవాన్ని మాత్రం ఇప్పట్లో మరచిపోలేనని చిలుక పలుకులు పలికింది.
News Posted: 26 October, 2009
|