'బిగ్ బాస్ 3'కి షోకాజ్
న్యూఢిల్లీ: బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న 'బిగ్ బాస్ 3' రియాలిటీ షో మూడో సీజన్ కార్యక్రమం చిక్కుల్లో పడింది. కలర్స్ ఛానల్ లో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమంలో వాడుతున్న అశ్లీల పదజాలం, పోటీదారుల తీరు ఉత్తమాభిరుచికి భంగం కలిగించేలా ఉందంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనిపై ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
'ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారు అనుచిత పదజాలం ఉపయోగిస్తుండటం, వాటి విజువల్స్ ప్రోగ్రామ్ కోడ్ ను ఉల్లంఘించినట్టు కనిపిస్తోంది' అని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇందుకు ఓ ఉదాహరణ కూడా ఇస్తూ, ఇటీవల ప్రసారమైన కార్యక్రమంలో ఒక పార్టిసిపెంట్ మరొకరి చొక్కాను పట్టుకుని గుంజడం జరిగిందనీ, ఇది వీక్షకుల మనోభావాలను దెబ్బతీస్తుందని, ప్రైమ్ టైమ్ లో ఈ కార్యక్రమం ప్రసారమవుతున్నందున పిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా దీనిని వీక్షిస్తారనీ, ప్రోగ్రాంలో చేటుసుకునే సంఘటనలు వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయనీ ఆ నోటీసులో స్పష్టం చేశారు. అభ్యంతరకరమైన విజువల్స్ ను మళ్లీ మళ్లీ టెలికాస్ట్ చేస్తుండటం పట్ల కూడా సమాచార శాఖ తప్పుపట్టింది. 1995 కేబుల్ టెలివిజన్ నెట్ వర్స్స్ (రెగ్యులేషన్) చట్టం కింద ఈ నోటీసును పంపారు.
News Posted: 27 October, 2009
|