మమ్ముట్టి స్టార్ షో రసాభాస
http://www.telugupeople.com/uploads/tphome/images/2009/mammootty1.jpg' align='right' alt=''>దుబాయ్: మలయాళ సూపర్ స్టార్ మమ్ముటిని అవార్డుతో సన్మానించేందుకు దుబాయ్ లో ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్ ఏర్పాటు చేసిన స్టార్ నైట్ కార్యక్రమం అభిమానుల అత్యుత్సాహం కారణంగా రసాభాస అయింది. పెద్ద ఎత్తున జనం సభాస్థలిలోకి దూసుకురావడంతో పోలీసులు లాఠీ చార్జి జరిపారు. జనం తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఈ ఈ వెంట్ చివర్లో '2009 ది బెస్ట్ యాక్టర్ అవార్డు' అందుకునేందుకు దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఎక్స్ పో వెన్యూలోకి మమ్ముట్టి అడుగుపెట్టగానే ఆయనను చూసేందుకు జనం ఒక్కసారిగా విరుచుకుపడ్డారనీ, వారిని అదుపులో పెట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారనీ, ఈ తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారని దుబాయ్ పత్రికలు సోమవారంనాడు ప్రచురించాయి.
ఎయిర్ పోర్ట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కెపాసిటీ 7,500 మంది కాగా, టిక్కెట్లు లేని వారు కూడా మమ్ముట్టిని చూసేందుకు రెట్టింపు సంఖ్యలో చొచ్చుకురావడంతో గందరగోళం తలెత్తిందనీ, పరిస్థితులు అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జి జరిపారనీ నిర్వాహకులలో ఒకరైన బిందు మీనన్ తెలిపారు. గతంలో తాము పలు ఈవెంట్స్ ను విజయవంతంగా నిర్వహించినప్పటికీ ఈసారి మాత్రం పరిస్థితులు అదుపు తప్పాయని ఆయన వ్యాఖ్యానించారు. మమ్ముట్టి కారును కూడా జనం చుట్టుముట్టడంతో ఆయన సభాస్థలిలోకి అడుగుపెట్టడం కష్టమైందని అన్నారు. ఈ పరిస్థితులలో మమ్ముట్టి వెనక్కి వెళ్లిపోవాలనుకున్నప్పటికీ ఎంతో సంయమనం పాటించారని చెప్పారు. మమ్ముట్టి స్టార్ నైట్ చిక్కుల్లో పడటం, పలువురు గాయపడటంతో ఈ ఈవెంట్ ను నిర్వాహకులు రద్దు చేయక తప్పలేదు.
News Posted: 27 October, 2009
|