రెహ్మాన్-కత్రిన ఆల్బమ్
ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రెహ్మాన్, బాలీవుడ్ నెంబర్ వన్ రేసులో ఉన్న కత్రినా కైఫ్ కలిస్తే అది అసాధారణమైన కాంబినేషనే అవుతుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఈ ఇద్దరూ కలిసి ఓ మ్యూజిక్ ఆల్బమ్ చేయబోతున్నారు. రెహ్మాన్ తో కలిసి కత్రిన తన గానమాధుర్యం కూడా పంచబోతోంది. ఆ అల్బమ్ ఏమిటనే ఉత్సుకత సహజమే కదా. ఇదొక 'నర్సరీ రైమ్స్' ఆల్బమ్. ఈ మ్యూజిక్ వీడియోస్ లో కత్రినా కనిపించబోతోంది కూడా.
'స్లమ్ డాగ్ మిలయనీర్' తర్వాత రెహ్మాన్ ఏ ఇండియన్ ప్రాజెక్ట్ ను ఒప్పుకోలేదు. 'బ్లూ' మ్యూజిక్ ఆయన అంతక్రితం ఒప్పుకున్నదే. అయితే ఆయన ఈ చిల్ట్రన్ ఆల్బమ్ కు మాత్రం సైలెంట్ గా పనిచేస్తున్నారు. చిన్నారులు 'ట్వింకిల్...ట్వింకిల్' అంటూ పాడుకునే అన్ని రైమ్స్ ఈ ఆల్బమ్ లో చోటుచేసుకోనున్నాయి. అయితే ఇవన్నీ రెహ్మాన్ స్టయిల్ లో కంపోజ్ అవుతాయి. వీటికి తోడు చెన్నైలోని ఆయన మ్యూజిక్ ఇన్ స్టిట్యూట్ విద్యార్థులు కంపోజ్ చేసిన ఫ్రెష్, ఒరిజనల్ సాంగ్స్ కూడా ఇందులో చోటుచేసుకుంటాయి. పిల్లల పట్ల ప్రత్యేక అనుబంధం చూపించే కత్రినా ఈ మ్యూడిక్ వీడియోలో పిల్లలతో కలిసి గొంతు కలపనున్నారు. పిల్లలతో మమేకమై పనిచేయడం తనకెంతో ఇష్టమనీ, పిల్లలు కూడా అలాంటి అనుభూతినే పొందుతారని అనుకుంటున్నాననీ కత్రినా చెబుతోంది. 'రెహ్మాన్ చేసిన వందేమాతరం తరహాలోనే ఈ కాన్సెప్ట్ కూడా ఉంటుంది' అని ఈ ప్రాజెక్ట్ డైరెక్టర్ అపూర్వ్ నాగ్ పాల్ తెలిపారు.
News Posted: 28 October, 2009
|