తమిళ స్టార్స్ కు నోటీసులు

చెన్నై: పాత్రికేయులు, వారి కుటుంబాలను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన అభియోగంపై పలువురు తమిళ నటీనటులకు శివగంగై జిల్లా కోర్టు నోటీసులు పంపింది. తమిళ దినపత్రిక 'దినమలర్' కొందరు తారల ప్రతిష్ఠను భంగపరుస్తూ వార్త ప్రచురించడాన్ని నడిగర సంఘం ఇటీవల చెన్నైలో నిరసన ప్రదర్శన జరిపింది. ఈ సందర్భంలో పలువురు తారలు తమ ప్రసంగాల్లో పాత్రికేయులు, వారి కుటుంబాలను కించపరచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఒక జర్నలిస్టు భార్య కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ మొదలైంది.
ఐపిసి 499 సెక్షన్ కింద సదరు నటీనటులను శిక్షించాలని పిటిషనర్ తన పిటిషన్ లో కోర్టును కోరారు. దీనిపై విచారణ జరిపిన మేజిస్ట్రేటు పిటిషన్ లో పేర్కొన్న శ్రీప్రియ, సూర్య, విజయ్ కుమార్, అరుణ్ విజయ్, వివేక్, సత్యరాజ్, శరత్ కుమార్, చరణ్ లకు సమన్లు పంపారు. ఈనెల 19వ తేదీన జరుగనున్న విచారణకు కోర్టు ముందు హాజరు కావాలని ఆయన ఆదేశించారు.
News Posted: 3 November, 2009
|