త్రిష ఎట్టకేలకు బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్షయ్ కుమార్ సరనస ఆమె నటించే 'కట్టామీటా' సినిమా ప్రారంభమైంది. త్రిషను తమిళంలోకి పరిచయం చేసిన ప్రియదర్శన్ ఇప్పుడు హిందీకి కూడా ఆమెను ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నారు. పుణెకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బారామతిలోని ఓ కుగ్రామంలో షూటింగ్ ప్రారంభమైంది. గౌతమ్ మీనన్ 'విన్నైతాండి వరువాయ' చిత్రం కోసం శింభుతో కలిసి న్యూయార్క్ లో జరుగుతున్న షూటింగ్ లో కొద్దిరోజులుగా పాల్గొంటున్న త్రిష పుణెకి బయలుదేరే ముందు తన తల్లి, నానమ్మ ఆశీస్సులు తీసుకుంది.
'కట్టామీటా' ముహూర్తం సన్నివేశాల అనంతరం ప్రియదర్శన్ మాట్లాడుతూ 'నా గత చిత్రాల్లో చేసిన హీరోయిన్ల కంటే ఎక్కువ ఛాలెంజింగ్ రోల్ ను త్రిష ఇందులో పోషిస్తోంది. రెండు వైరుధ్యమైన భావాలున్న పాత్రలో ఆమె కనిపిస్తుంది. అలాగని ద్విపాత్రాభినయం కాదు. అక్షయ్ తో నేను చేసిన కామెడీ చిత్రాలకు భిన్నంగా హృషీకేష్ ముఖర్జీ, బసు చటర్జీ తరహాలో సాగే కుటుంబ కథా చిత్రమిది. నటీనటులు తమ ప్రతిభాపాటవాలను చాటుకునేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుంది' అని తెలిపారు. ఈ చిత్రంలో త్రిష వస్త్రాల రూపకల్పన అన్నా సింగ్ చేస్తున్నారు. 'త్రిష షూటింగ్ కు ముందే మాకు ఓ విషయం చెప్పింది. స్కూలులో హిందీ చదువుకున్నప్పటికీ మాట్లాడటం అంతగా రాదని తెలిపింది. తీరా సెట్స్ లోకి రాగానే ఆమె ఎక్కడా తడుముకోకుండా హిందీలో మాట్లాడటం చూసి అంతా ఆశ్చర్యపోయాం. ఆమె నటన చూసి అక్కీ ముఖంలో చిరునవ్వు తాండవించింది' అని ప్రియదర్శన్ చెప్పుకొచ్చారు. ఉత్తరాదిన కాలుపెట్టిన త్రిష దక్షిణాదిలోనూ కెరీర్ పరంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న రెండు తెలుగు చిత్రాలు స్టార్ హీరోలతోనే కావడం విశేషం. వెంకటేష్ సరసన నటిస్తున్న 'నమో వెంకటేశ' ప్రోగ్రస్ లో ఉంది. ఎన్టీఆర్ సరసన తొలిసారి 'బృందావనం' చిత్రంలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.